నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ-2’ నేడు(డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు విడుదలకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకున్న సినిమా.. సడెన్‌గా ఆడిపోవడానికి గల కారణాలు ఏంటి?
షాకిచ్చిన మద్రాసు హైకోర్టు
అఖండ 2 చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు రూ. 28 కోట్ల బాకీ ఉందని, ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలను ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది.

28 కోట్ల బాకీ సంగతేంటి?
ఈరోస్ ఇంటర్నేషనల్(Eros International Media Ltd) - 14 రీల్స్ సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అఖండ 2(Akhanda 2: Thaandavam) సినిమాతో ఈరోస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ గతంలో 14 రీల్స్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన ‘1-నేక్కొడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. ఆ చిత్రానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలమవడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు.
ఆ నష్టాలను పూడ్చేందుకు మహేశ్ బాబు మరో చిత్రం ‘దూకుడు’ కూడా అదే సంస్థకు ఇచ్చారు. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 14 రీల్స్( 14 Reels Entertainment)-ఈరోస్ మధ్య రెవెన్యూ షేరింగ్, సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి. 14 రీల్స్ సంస్థ తమకు రూ. 28 కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈరోస్ కోర్టు మెట్లు ఎక్కింది.
పేరు మార్చిన ఫలితం లేదు!
14 రీల్స్-ఈరోస్ మంధ్య కోర్టు కేసు కొన్నేళ్లుగా నానుతూ ఉంది. కొన్నేళ్ల కిత్రం ఈరోస్ ట్రిబ్యునల్‌కి వెళ్లగా.. 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ 14 రీల్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021లో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. ఇలా కోర్టులో పిటిషన్స్ వేస్తూ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పైగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ పేరును కాస్త ‘14 రీల్స్ ప్లస్’గా పేరు మార్చి.. అఖండ 2 సినిమాను నిర్మించారు.
అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒక్కటే అని.. ఈరోస్ ఆధారాలతో సహా కోర్టుకు అప్పజెప్పడంతో.. రిలీజ్ చేయొద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు మరికొంత మంది ఫైనాన్షియర్లు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవకు దిగినట్లు సమాచారం. అఖండ 2 చిత్రానికి ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరో మగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ల అమౌంట్ కూడా సెటిల్ చేయకుండానే రిలీజ్‌కి వచ్చేశారట. దీంతో వాళ్లు కూడా విడుదలను అడ్గుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమస్యలు అన్నీ క్లియర్ అయితేనే..అఖండ-2 రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తుంది.


