ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్‌మెన్‌తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు.
బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్
అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సూర్య గ్రీన్ సిగ్నల్?
ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


