క్లుప్తంగా
మైక్రోపుల్ ఫిల్‌మెంట్ కేంద్రాలపై దృష్టి
సాక్షి, చైన్నె: అత్యంత వేగవంతమైన డెలివరీ సేవలలో భాగంగా రోజుకు రెండు కొత్త మైక్రో పుల్ ఫిల్‌మెంట్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టామని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ తెలిపారు. 10 నిమిషాలలో విక్రేతల నుంచి వేలాది రోజువారీ నిత్యావసర వస్తువులను పొందేందుకు వీలు కల్పిస్తూ చేపట్టిన ఈ ప్రక్రియ గురించి గురువారం సమీర్ కుమార్ స్థానికంగా వివరించారు. అమెనాజన్ నౌ కిరాణా సామాగ్రి, వ్యక్తిగత సంరక్షణ, బ్యూటీ ఉత్పత్తులు,ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, చిన్న ఉపకరణాలు,పిల్లలకు సంబంధించిన వస్తువులు, పెంపుడు జంతువులకు ఉపయోగ పడే సామాగ్రి అంటూ అనేక నిత్యావసర వస్తువులను త్వరిగతిన వినియోగదారులకు దరి చేర్చేందుకే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 300 మైక్రో పుల్ ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు.
14 మందికి జీవిత ఖైదు
అన్నానగర్: ఆలంగులం సమీపంలో 2015లో జరిగిన వ్యాపారి హత్య కేసులో 14 మందికి రెండు జీవిత ఖైదు విధిస్తూ తెన్‌కాశీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెన్‌కాశి జిల్లా ఆలంకుళం సమీపంలోని కాశీనాథపురంలో సీవలప్పెరి సుడలై మాడసామి ఆలయం ఉంది. 2015సవంత్సరంలో ఉత్సవాల నిర్వహణపై ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో పుదుపట్టి మెయిన్ రోడ్‌కు చెందిన మణివేల్ (45) సెప్టెంబర్ 3, 2015 హత్యకు గురయ్యాడు. ఈకేసు విచారణ బుధవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తి మనోజ్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. నేరం రుజువు కావడంతో 14 మంది నిందితులకు రెండు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు.
ఘనంగా ఘంటసాల జయంతి
కొరుక్కుపేట: ఘంటసాల 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనకాపుత్తూరు తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కుమార్ నివాళిలర్పించారు. అసోసియేషన్ సెక్రటరీ కస్తూరినాయుడు, నటరాజన్, దినకరన్ పాల్గొన్నారు.
విరుగంబాక్కం గుడిలో చోరీ
తిరువొత్తియూరు: విరుగంబాకంలో విఘ్నేశ్వర ఆలయంలో చోరీ చేసిన ఓ బాలుడి సహా మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. విరుగంబాక్కం, ఆర్కాట్ రోడ్డులో వున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వినాయకుడి గుడి ఉంది. గత నెల 26వ తేదీ అర్ధరాత్రి ఈ గుడి హుండీని పగలగొట్టి రూ.7 వేలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. కేకే నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిఘా కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, అదే ప్రాంతానికి చెందిన రంజన్ తన సహచరులైన 18 ఏళ్ల లోపు ఇద్దరు మైనర్లతో కలిసి హుండీని పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు తేలింది. బుధవారం రాత్రి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు 3 నెలల క్రితం కూడా ఇదే గుడిలో హుండీని పగలగొట్టి దొంగతనం చేశారు. 2వ సారి మళ్లీ అదే గుడి హుండీని పగలగొట్టి దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు నిఘా కెమెరాలో రికార్డైనందున పట్టుబడ్డారు. అరెస్ట్ అయిన రంజనన్‌పై ఇప్పటికే పలు దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిసింది. అతన్ని పుళల్ జైలులోనూ, ఇద్దరు మైనర్లను కిల్లీస్‌లోని సంస్కరణ పాఠశాలలో ఉంచారు
అయ్యప్పస్వామి ఆలయంలో పడి ఉత్సవాలు
తిరువళ్లూరు: పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పడి ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు హాజరయ్యారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్నదానంతో పాటూ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు.
బైక్ అదుపుతప్పి యువతి దుర్మరణం
అన్నానగర్: బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. కోయంబత్తూర్ జిల్లాలోని పొల్లాచ్చి సమీపం చిన్నంపాలయం గ్రామానికి చెందిన అముద (22). ఈమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. అముద బుధవారం తమ్ముడు కాళిదాస్‌తో కలిసి పొల్లాచ్చి వైపు బైక్‌లో వెళుతోంది. సమత్దూర్ మనల్మేడు సమీపంలో వెళుతుండగా అముద ధరించిన దుపట్టా బైక్ చక్రంలో చిక్కుకుంది. దీంతో అముద నియంత్రణ కోల్పోయి కింద పడింది. దుపట్టా ఆమె మెడకు బిగుసుకుపోవడంతో స్పృహతప్పి కింద పడింది. గాయపడ్డ ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అముద అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


