రాజుకున్న‘దీపం’ చిచ్చు
సాక్షి, చైన్నె: తిరుప్పర కుండ్రం కొండపై దీపం వెలిగించే విషయంలో ఏర్పడిన వివాదం మరింతగా రాజుకుంది. మధురై ధర్మాసనం న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఉత్తర్వులతో గురువారం రాత్రి తిరుప్పర కుండ్రంలో మరింత హైటెన్షన్ నెలకొంది. వివరాలు.. మురుగన్‌కు రాష్ట్రంలోని ఆరుపడై వీడులలో ఒకటిగా ఉన్న తిరుప్పర గుండ్రంలో కార్తీక దీపం వెవెలిగింపు వివాదం బుధవారం నుంచి ఉత్కంఠను రేపుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆలయం కొండపై ఉన్న దర్గాకు సమీపంలోని స్తూపంలో దీపం వెలిగించేందుకు హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన ఉత్తర్వులతో వివాదం మరింతగా రాజుకుంది. అయితే సంప్రదాయబద్ధంగా ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్దే దీపం వెలిగిస్తామనంటూ ఆలయ నిర్వాహక కమిటీ తేల్చి చెప్పింది. అదే సమయంలో బుధవారం సాయంత్రం న్యాయమూర్తి ఆదేశాలతో, సీఆర్‌పీఎఫ్ భద్రత నడుమ పిటిషనర్ రామరవికుమార్ దీపం వెలిగించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఈ పరిస్థితులలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జీఆర్‌స్వామినాథన్ ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ గురువారం డివిజన్ బెంచ్‌లో తిరస్కరణకు గురైంది. ఉత్తర్వులను అమలు పరచని వారిపై కోర్టు ధిక్కార కేసుగా మళ్లీ జీఆర్ స్వామినాథన్ బెంచ్ గురువారం సాయంత్రం విచారణ మొదలెట్టింది. పోలీసులు, జిల్లా కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారికి తీవ్ర హెచ్చరికలను న్యాయమూర్తి జారీ చేశారు. 144 సెక్షన్ ఉత్తర్వులను రద్దు చేశారు. స్వయంగా మదురై పోలీసు కమిషనర్ లోకనాథన్ పిటిషనర్‌ను వెంట బెట్టుకుని కొండపైకి వెళ్లి దీపం వెలిగించాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. దీపం వెలిగించినందుకు గాను నివేదికను శుక్రవారం 10.30 గంటలలోపు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉత్తర్వులతో టెన్షన్
తీవ్ర హెచ్చరికలు, ఉత్తర్వుల నేపథ్యంలో హిందూ సంఘాలు, బీజేపీ వర్గాలు మరింత దూకుడుగా తిర్పుర గుండ్రం ఆలయం వైపుగా దూసుకెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, సీనియర్ నేత హెచ్‌ఆర్ రాజలతో పాటుగా పెద్దఎత్తున సమూహం అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లిందని, ఆరుగంటల తర్వాత కొండపైకి ఎవ్వర్నీ అనుమతించ కూడదన్న నిబంధనలు ఉన్నాయని,144 సెక్షన్ అమల్లోనే ఉందని పోలీసు అధికారులు బీజేపీ నేతలకు సూచించారు. బీజేపీ నేతలను బుజ్జగించారు. చివరకు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పిటిషనర్ రామ రవికుమార్, ఆయన మద్దతుదారులు హిందూ మున్నని వర్గాలు మాత్రం ఆలయం వద్దే తిష్ట వేశాయి. కమిషర్ వచ్చి కొండపైకి తీసుకెళ్లాల్సిందేనని భీష్మించుకుని కూర్చుని ఉండటంతో టెన్షన్ నెలకొంది. వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటూ పలువురు నేతలు న్యాయమూర్తి ఏక పక్ష తీర్పుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
గత తీర్పును మరిచి మాట్లాడుతున్నారు..
తిరుప్పర కుండ్రం కొండ వ్యవహారంలో గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను దాచి పెట్టి, తాజాగా రాద్ధాంతం సృష్టిస్తున్నారని మంత్రి రఘుపతి వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందూత్వ వాదులు, మతతత్వ శక్తులు తమిళనాడుపై కుట్ర పన్నుతున్నాయని, ఇందుకు తాజాగా తిరుప్పర కుండ్రం అంశాన్ని తెర మీదకు తెచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొండపై దీపం వెలిగింపు వ్యవహారంలో 2014లోనే హైకోర్టు ద్విసభ్య బెంచ్ స్పష్టమైన తీర్పు వెలువరించిందని వివరించారు. సంప్రదాయబద్ధంగా ఎక్కడ దీపం వెలిగించాలో అక్కడే వెలిగించే విధంగా ఆ తీర్పులో స్పష్టం చేశారని, ఈ మేరకు ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద దీపం వెలిగించడం జరుగుతున్నట్టు తెలిపారు. 2017లో కూడా ఇదే విధంగా మరో తీర్పు వచ్చిందన్నారు. కొత్తగా అడిగిన చోటంతా దీపం వెలిగించే అవకాశం లేదని స్పష్టం చేసినట్టు వివరించారు. అయితే, ఈ తీర్పులను దాచి పెట్టి, సింగిల్ బెంచ్‌ను సైతం తాజాగా తప్పుదోవ పట్టించి ఉన్నారని పేర్కొన్నారు. తాము చట్టాన్ని గౌరవించే వాళ్లం అని, ఈ మేరకు గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తాజాగా వ్యవహరిస్తున్నామన్నారు. బీజేపీ వద్ద బానిస బతుకు బతుకుతున్న అన్నాడీఎంకే పళణి స్వామి గతంలో సీఎంగా ఉన్నప్పుడు, అలాగే గతంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పిటిషనర్లకు వ్యతిరేకంగా కోర్టులు ఈ తీర్పును వెలువరించి ఉండడాన్ని గుర్తెరగాలని ఈసందర్భంగా డీఎంకే సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతి సూచించారు.


