మామిడి గుర్తుపై సందిగ్ధం
సాక్షి, చైన్నె: పీఎంకే చిహ్నం మామిడి పండు 2026 ఎన్నికలలో స్తంభింప చేస్తారా? అన్న చర్చ తెర మీదకు వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరికలు చేసే విధంగా వాదనలను ఢిల్లీ కోర్టులో ఉంచడంతో పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి సందిగ్ధంలో పడ్డారు. వివరాలు.. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న వార్ గురించి తెలిసిందే. పార్టీని తన గుప్పెట్లోకి అన్బుమణి తాజాగా తెచ్చుకున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులే ఇందుకు కారణం. అదే సమయంలో పార్టీ తనదేనంటూ ఆయన తండ్రి, వ్యవస్ధాపకుడు రాందాసు న్యాయ పోరాటం బాటపట్టారు. ఢిల్లీ హైకోర్టులో పీఎంకే ఎవరిది? అన్న వ్యవహారంపై విచారణ గురువారం జరిగింది. రాందాసు, అన్బుమణి రాందాసుల తరపున వాదనలు హోరెత్తాయి. అదే సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన పరోక్ష హెచ్చరిక రాందాసు, అన్బుమణిలను సందిగ్దంలో పడేసింది. తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి వ్యవహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ కోర్టుకు వివరణ ఇచ్చింది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఒకవేళ ఎన్నికల సమయంలో పార్టీకి సంబంధించి ఏదేని వివాదం ఉన్న పక్షంలో ఆ పార్టీ చిహ్నం స్తంభింప చేయక తప్పదంటూ వాదనలు వినిపించడం గమనార్హం. అదే సమయంలో అన్బుమణికి వ్యతిరేకంగా ఏదేని ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని రాందాసు తరపున వారికి ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించడం గమనార్హం. పీఎంకే చిహ్నం మామిడి స్తంభింప చేస్తాన్నట్టుగా కేంద్ర ఎన్నికల కమిషన్ సందించిన నేపథ్యంలో వివాదాన్ని పక్కన పెట్టి రాందాసు, అన్బుమణి మళ్లీ ఏకం అయ్యేనా? అన్నది వేచిచూడాల్సిందే.


