‘‘సైక్ సిద్ధార్థ’ చిత్రంలో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి శ్రావ్య పాత్ర చేశాను. విడాకులు తీసుకున్న అమ్మాయి... తనకు ఒక పిల్లాడు ఉంటాడు. తన బిడ్డ భవిష్యత్ కోసం భర్త నుంచి విడిపోయి ఎలాంటి జీవితాన్ని లీడ్ చేసింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. శ్రావ్య పాత్రలో నటనకి చాలా స్కోప్ ఉంది. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని యామినీ భాస్కర్ తెలిపారు.
శ్రీ నందు హీరోగా వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా యామినీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఏ సినిమా చేయాలి? ఎలాంటి పాత్ర చేయాలని ఆలోచిస్తున్నప్పుడు... ఓ ఫ్రెండ్ ద్వారా డైరెక్టర్ వరుణ్‌ని కలిశాను.
శ్రావ్య పాత్ర గురించి ఆయన చెప్పగానే ఓకే అన్నాను. సహజమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. సురేష్‌బాబు, రానాగార్లకు మా సినిమా నచ్చడంతో విడుదల చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో మా ‘సైక్ సిద్ధార్థ’ పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ పోస్టర్ వద్ద డైరెక్టర్ వరుణ్, నేను ఫొటోలు కూడా తీసుకున్నాం. ఈ సినిమా చూసిన డైరెక్టర్ సాయి రాజేశ్‌గారు.. ‘ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఇప్పటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయండి’ అని చెప్పడం హ్యాపీగా అనిపించింది. మంచి పాత్రలు వస్తే ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తాను’’ అని చెప్పారు.


