రానా, అనురాగ్, శరత్, రవిశంకర్
‘‘నేను, శరత్, అనురాగ్ కలిసి టీవీ షోలు, స్టేజ్ ఈవెంట్స్, మూవీ మార్కెటింగ్... ఎన్నో చేశాం. నా ప్రతి ప్రయాణంలో వాళ్లు ఉన్నారు. వారు కొత్తగా ప్రారంభిస్తున్న ‘చాయ్ షాట్స్’ ప్రయాణంలో నేను కూడా ఒక చిన్న భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’’ అని హీరో రానా దగ్గుబాటి తెలిపారు. తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్ మెంట్‌లో గత పదేళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న చాయ్ బిస్కెట్ సంస్థ తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను నెలకొల్పింది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చాయ్ షాట్స్’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ– ‘‘చాయ్ షాట్స్’ ఆలోచన చూస్తుంటే మేము కూడా వాళ్లతో భాగం కావాలని ఉంది. ఇందులోని క్రియేటర్స్, యాక్టర్స్ త్వరలో బిగ్ స్క్రీన్‌కి రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘చాయ్ షాట్స్’ ని మేము రెండు నెలల క్రితమే లాంచ్ చేశాం. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాయ్ షాట్స్’లో 2 నిమిషాల లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి’’ అని చాయ్ బిస్కెట్ శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీటీవో కృష్ణ, ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, సెంట్రల్ క్యాటలిస్ట్ రాహుల్ హుమాయున్ తదితరులు మాట్లాడారు.


