ఎన్టీఆర్.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్ అయినా, మాస్ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్, హరిన్ ఇద్దరూ యాక్టింగ్‌నే ఎంచుకున్నారు.
హీరోగా ఎంట్రీ
కళ్యాణ్ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్, రౌడీ బాబాయ్, అత్తగారు జిందాబాద్, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.
ఆ విషాదంవల్లే..
నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్‌దాస్ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు.
36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో కళ్యాణ్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉంది. కాగా ఎన్టీఆర్ నామకరణం చేసిన వైజయంతి మూవీస్ సంస్థతోనే కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్ 25న విడుదలవుతోంది.
చదవండి: రాత్రిపూట మనోజ్ ఫోన్‌కాల్.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్ నటుడు


