అలనాటి సినీ నటి కాంచన(86) అసలు పేరు వసుంధర.. చాలారోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు ఆమె వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్‌గా తిరిగి మరో ఆటోలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ… ఒక్కతే తిరుగు పయణమయ్యారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

బ్రహ్మచారిణిగా..
60, 70వ దశకంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు కాంచన. ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ప్రేమనగర్, శ్రీకృష్ణావతారం , ఆనంద భైరవి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే.. కానీ, పుట్టింది చెన్నైలో ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు.
ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిని ఆమె ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.
తల్లిదండ్రులే శత్రువులయ్యారు
తన తల్లిదండ్రుల గురించి కాంచన ఇలా చెప్పారు.. 'జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్‌లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్థి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. తన తల్లిదండ్రులు, దాయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానన్నారు. 1983లోనో 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు.

అర్జున్‌రెడ్డి కోసం 40 ఏళ్ల తర్వాత..
సుమారు 40 ఏళ్లతర్వాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు. సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఒకరోజు తనను చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు. అర్జున్‌రెడ్డివలో నానమ్మగా చేయాలని కోరారు. కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తిరుమల శ్రీనివాసుడికి రూ. 100 కోట్లు
జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కాంచన.. అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన అస్తి లేకుండా చేశారు. అయినా కూడా ఆమె మళ్లీ నిలదొక్కుకున్నారు. చెన్నైలో కలియుగ దైవం వేంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో రూ. 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ రూ. 100 కోట్ల పైమాటేనని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
ప్రస్తుతం ఎవరు చూసుకుంటున్నారు?
కాంచనను ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెలు, మరిది వాళ్లంతా అండగా ఉన్నారని చెప్పారు. చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటూ.. నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటానని తెలిపారు.


