18 కిలోలు తగ్గాను.. నచ్చకపోతే క్షమాపణలు చెబుతా: నందు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు అయింది. నా నటన గురించి ఇప్పటివరకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. ‘సైక్ సిద్ధార్థ’ సినిమా నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటూ సినిమాలు చేస్తాను. గెలిచేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు శ్రీ నందు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు, యామినీ భాస్కర్ జోడీగా నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ నందు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలా, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకులు రాఘవేంద్రరావు, సాయిరాజేశ్, అనుదీప్గార్లు మా సినిమా చూసి, అభినందించారు. ఈ చిత్రం కోసం నేను పద్దెనిమిది కిలోలు తగ్గాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు వరుణ్ రెడ్డి. ‘‘చాలా గ్యాప్ తర్వాత నా సినిమా రిలీజవుతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు యామినీ భాస్కర్.