టాలీవుడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు ఉంటుంది. గతవారం చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే మూవీని విడుదలకు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీకెండ్ పూర్తిగా వృథా అయిపోయింది. ఈ వారం ఏమో ఏకంగా 15 చిన్నా చితకా మూవీస్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడదగ్గవి ఏవి?
పేరుకే ఈ వారం 15 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు మాత్రమే కాస్త చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో కార్తి 'అన్నగారు వస్తారు' అనే డబ్బింగ్ చిత్రం ఒకటి కాగా.. యాంకర్ సుమ కొడుకు రోషన్ 'మోగ్లీ', నందు 'సైక్ సిద్ధార్థ్' ఉన్నంతలో చూడొచ్చేమో అనిపిస్తున్నాయి. వీటికి కూడా పెద్దగా గొప్ప హైప్ ఏం లేదు. హిట్ టాక్ వస్తే తప్ప వీటిపై ప్రేక్షకులు దృష్టిపెట్టరు.
(ఇదీ చదవండి: హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)
ఈ మూడు కాకుండా విడుదలయ్యే మిగతా సినిమాల విషయానికొస్తే సకుటుంబానాం, ఈషా, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, వన్ బై ఫోర్, ఘంటసాల, ఇట్స్ ఓకే గురు, కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్, డ్రైవ్, లాక్ డౌన్, ఎవడి సినిమాకు వాడే హీరో.. ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని మూవీస్.. ఈ వారం వస్తున్నాయని ప్రేక్షకులకు తెలుసో లేదో కూడా తెలియదు.
ఇలా వస్తే వారంలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదంటే ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంటుంది. ఈ విషయమై టాలీవుడ్ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోకపోతే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకే నష్టం. ఇప్పటికే ఓటీటీల తీరు వల్ల చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ హీరోల సినిమాలని థియేటర్లకు వెళ్లి జనాలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ఇలా ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తే జనాలయినా ఎందుకొస్తారు చెప్పండి?
(ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


