యంగ్ హీరో నందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్‌ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అఖండ 2 రిలీజ్ అవ్వడంతో చివరి నిమిషంలో జనవరి 1కి వాయిదా వేశారు. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ ట్రైలర్‌లో బూతు పదాలు పెట్టడం..అవి కాస్త వైరల్ అవ్వడంతో సైక్ సిద్ధార్థ్‌పై హైప్ క్రియేట్ అయింది. యూత్ టార్గెట్‌గా నేడు (జనవరి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నందు ఖాతాలో హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.(Psych Siddhartha Telugu Movie Review)
కథేంటంటే..
హైదరాబాద్‌కి చెందిన యువకుడు సిద్ధార్థ (శ్రీ నందు), పబ్‌లో పరిచయం అయిన త్రిష(ప్రియాంక రెబెకా శ్రీనివాస్) అనే అమ్మాయితో రిలేషన్‌షిప్ పెట్టుకుంటాడు. ఆమె కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. బిజినెస్ పార్ట్నర్స్‌గా మన్సూర్(సుఖేష్ రెడ్డి)తో పాటు ప్రియురాలు త్రిష కూడా ఉంటారు. చివరకు మన్సూర్, త్రిష కలిసి సిద్ధార్థను మోసం చేస్తారు. వాళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో పడి సిద్ధార్థను కంపెనీ నుంచి బయటకు గెంటేస్తారు.
ఉన్న డబ్బంతా వాళ్లే దోచుకోవడంతో అద్దె కూడా సరిగా కట్టలేక.. బస్తీలో ఓ చిన్న ఇంట్లోకి అద్దెకు దిగుతాడు సిద్ధార్థ. అదే బిల్డింగులోకి భర్త చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తున్న శ్రావ్య(యామిని భాస్కర్) కూడా రెంట్‌కి దిగుతుంది. శ్రావ్యతో పరిచయం సిద్ధార్థ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(Psych Siddhartha Movie Story)

విశ్లేషణ
కొన్ని సినిమాలకు కథ ఉండదు కానీ కథనంతో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అలాంటి మ్యాజికే సైక్ సిద్ధార్థ్ సినిమాలో చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు వరుణ్ రెడ్డి. రొటీన్ కథనే తెరపై డిఫరెంట్‌గా చూపించాలకున్నాడు. అయితే ఆ ప్రయత్నం దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కథనం కొత్తగా ఉన్నా..కథలో బలం లేకపోవడంతో ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
పైగా రెండు ప్రధాన పాత్రల పరిచయం తర్వాత కథనం మొత్తం ఊహకందేలా సాగడం మరో మైనస్. అయితే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం యువతను..ముఖ్యంగా జన్ జీ బ్యాచ్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. అదే సమయంలో అవసరానికి మించిన అడల్ట్ సీన్లు పెట్టి..ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేశారు. (Psych Siddhartha Strengths And Weaknesses)
అమ్మాయి కోసం అర్థ నగ్నంగా పరుగెడుతున్న సిద్ధార్థ్ పాత్ర పరిచయ సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పరుగు ఎవరి కోసం అనేది చివరిలో చూపించారు. ఫస్టాఫ్ అంతా సిద్ధార్థ్ పాత్ర చుట్టూనే తిరుగుంది. త్రిషతో పరిచయం.. మన్సూర్ మోసం.. బస్తీలో రెంట్‌కి దిగడం.. ఇలా రొటీన్‌గా సాగుతుంది. అయితే ఇక్కడ స్క్రీన్‌ప్లేతోనే మ్యాజిక్ చేశారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కథనాన్ని నడిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ సీన్‌తో క్లైమాక్స్ కథను ఊహించొచ్చు. ఉన్నంతలో సెకండాఫ్ కాస్త బెటర్. ఒకటి రెండు ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాకు ప్రధాన బలమైన సిద్ధార్థ పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో.. ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోయారు. ముందుగా చెప్పినట్లుగా జన్ జీ బ్యాచ్ మాత్రమే ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
నటీనటులు విషయానికొస్తే... సిద్ధార్థ్ పాత్రలో నందు జీవించేశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నందు అలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం అంతా తెరపై కనిపించింది. టైటిల్‌కి తగ్గట్లుగానే ఆయన చేసే సైకో చేష్టలు.. ఓ వర్గాన్ని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాయి. సింపుల్ సీన్స్ కూడా తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లాడు.
శ్రావ్య పాత్రకు యామిని భాస్కర్ పూర్తి న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హీరో ప్రియురాలు త్రిషగా ప్రియాంక రెబెకా బాగా నటించింది. డబ్బులంటే పిచ్చి ఉన్న మోడ్రన్ అమ్మాయి పాత్ర తనది. నందు ఫ్రెండ్ రేవంత్ పాత్రలో నటించిన వ్యక్తితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్మరన్ సాయి నేపథ్య సంగీతం డిఫెరెంట్‌గా ఉంది. ఎడిటింగ్ కొత్తగా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


