ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘3 ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారట రాజ్‌కుమార్ హిరాణి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కథ పూర్తయిన తర్వాత ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. ‘3 ఇడియట్స్’ చిత్రం తొలిపార్టులో నటించిన ప్రధాన తారాగణ మంతా సీక్వెల్‌లోనూ నటిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాలోని ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా.
ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమిర్‌ఖాన్ , రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్ లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ రానుందని ఓ ప్రకటన వచ్చింది. మరి.. ‘3 ఇడియట్స్’ సీక్వెల్ ముందు సెట్స్‌కి వెళుతుందా? లేక దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.


