తోడబుట్టినవాళ్ల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటే... ఆ అపార్థాలే వారు దూరమయ్యేలా చేస్తే... ఆ ఇద్దరి బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రచయిత చంద్రబోస్ ఊహించి ‘పొమ్మంటే...’ అంటూ భావోద్వేగంగా ఓ పాట రాశారు. నాగశౌర్య, శ్రీదేవి విజయ్‌కుమార్ సోదర, సోదరీమణిగా నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ సినిమాలోని ‘పొమ్మంటే...’ పాటను గురువారం విడుదల చేశారు.
ఈ ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయే నేపథ్యంలో వచ్చే పాట ఇది. రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’కి హ్యారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఆయన స్వరపరచిన ‘పొమ్మంటే...’ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ పాడారు. ‘‘హృదయాలను హత్తుకునేలా ఉండే ఈ పాట చాలాకాలం నిలిచిపోతుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. విధి, సముద్రఖని, నరేశ్ వీకే, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్.


