పైరసీ సినిమాలతో ఆరేళ్లపాటు సినీ పరిశ్రమతో పాటు పోలీసులను కూడా ముచ్చెమటలు పట్టించిన ఐబొమ్మ రవి కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ కావడం జరిగింది. పోలీసులు విచారణలో ఇప్పటికే అతను సంచలన విషయాలను తెలిపాడు. ఏవిధంగా నెట్‌వర్క్‌ను హ్యాక్ చేయగలడొ పోలీసులకు చూపించాడు. పలు వెబ్‌సైట్స్‌తో పాటు కొత్త సినిమా శాటిలైట్ పిన్ వంటి వాటిని సులువుగా హ్యాక్ చేయగలనని తెలిపాడు. దీంతో రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే, ఇదే అంశంపై తాజాగా సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు స్పందించారు.
ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని పేర్కొన్నారు. ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ తెలిపారు. 8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడని ఆయన అన్నారు. తప్పు చేశాననే బాధ రవిలో అసలు కనిపించలేదన్నారు. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు.


