చాలా సినిమాలు థియేటర్లలో రిలీజై ఆపై ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'స్టీఫెన్'. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!)
కథేంటి?
స్టీఫెన్ జబరాజ్ (గోమతి శంకర్) అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోతాడు. కోర్ట్‌లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో 15 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుంది. పోలీసులు విచారణ మొదలుపెడతారు. ఇంతకీ స్టీఫెన్ ఎవరు? అతడి గతమేంటి? తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి? కృతిక ఎవరు? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఓటీటీల్లో ఎక్కువమంది చూసేవి థ్రిల్లర్స్. సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీస్‌లు కావొచ్చు సరిగా తీయాలే గానీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. మరి 'స్టీఫెన్' ఎలా ఉందంటే ఓకే ఓకే అనిపిస్తుంది. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానం బోర్ కొట్టిస్తుంది. తొలి గంటలో జరిగే సీన్స్ అన్నీ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. తర్వాత నుంచి స్టోరీలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి.. బాగానే తీశారే అనిపిస్తుంది.
ఆడిషన్ కోసం పిలిచి అమ్మాయిలని స్టీఫెన్ హత్య చేయడం అనే పాయింట్‌తో సినిమా మొదలవుతుంది. తర్వాత ఇతడి కోసం పోలీసులు వెతకడం, ఇతడేమో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడం.. కోర్ట్‌లో హాజరు పరచడం.. తర్వాత పోలీస్ కస్టడీకి స్టీఫెన్‌ని అప్పగించడం ఇలా సీన్స్ చకచకా వెళ్తాయి. విచారణ మొదలైన తర్వాత స్టీఫెన్, అతడి గతం, తల్లిదండ్రులు ప్రవర్తన.. స్టీఫెన్ ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ అమ్మాయిలని ఎందుకు చంపాడు అనే ప్రశ్న మాత్రం మన మదిలో ఉండనే ఉంటుంది. దానికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది.
సినిమా అంతా ఓకే ఓకే ఉంటుంది గానీ చివరి 20 నిమిషాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అప్పటివరకు మనం చూసిందంతా అబద్ధం, ఇది కాక వేరే నిజం ఉంది అనే సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు.
సైకో కిల్లర్స్ అంటే ఎక్కడో ఉండరు. మన చుట్టుపక్కనే చాలా సాధారణంగా బతికేస్తుంటారు. కాకపోతే వాళ్ల మానసిక పరిస్థితి కారణంగా అమాయకులు బలైపోతుంటారనే విషయాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఈ స్టోరీలో చాలా కోణాలు ఉన్నాయి. ఓ సైకో కిల్లర్ అమ్మాయిలను చంపడం అనే కథని ఇదివరకే మనం చాలాసార్లు చూశాం. ఈ మూవీ స్టోరీ కూడా అదే అయినప్పటికీ కాస్త కొత్తగా ఉంటుంది. స్టీఫెన్ పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. అదే ఈ మూవీకి బలం. ఊహించని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి.
స్టీఫెన్ పాత్రలో గోమతి శంకర్ అనే కొత్త కుర్రాడు పర్లేదనిపించాడు. మరీ సూపర్ అని చెప్పలేం గానీ బాగా చేశాడు. ఇతడి తల్లిదండ్రులుగా చేసిన విజయ శ్రీ, కుబేరన్ ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఓకే ఓకే. టెక్నికల్‌గా ఈ సినిమా మరీ ఏమంత గొప్పగా అయితే అనిపించదు. కాకపోతే సైకలాజికల్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీస్ అంటే ఇష్టమున్న వాళ్లకు మాత్రం నచ్చేస్తుంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు గానీ ఒంటరిగానే చూడండి.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్)


