కారేపల్లి/ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచినా అతి సాధారణ జీవనం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యాన నల్లా సురేష్‌రెడ్డి నిర్మాతగా కామారెడ్డికి చెందిన పరమేశ్వర్ హివ్రాలె దర్శకత్వంలో సినిమా చిత్రీకరించనున్నారు.
సినిమా షూటింగ్ పాల్వంచలో శనివారం మొదలుకానుండగా.. గుమ్మడి నర్సయ్య పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్‌కుమార్ శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడేనికి శివరాజ్‌కుమార్ – గీత దంపతులు వచ్చారు. ఆయనతో సమావేశమైన శివరాజ్‌కుమార్.. గుమ్మడి జీవనశైలి, ఎన్నికల వేళ అవలంబించిన విధానాలు, ప్రజల్లో అభిమానం తదితర వివరాలు తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు పరమేశ్వర హివ్రాలెతో పాటు, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శిపోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు.


