సినిమా అనేది కూడా ఒక వ్యాపారం. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్లకు ఉంటాయి. స్టార్ హీరో సినిమా అయినా..‘లెక్కల్లో’ తేడా వస్తే.. ఆగిపోవాల్సిందే. దానికి మంచి ఉదాహరణే ‘అఖండ 2’. అన్ని అనుకున్నట్లుగా సాగితే నిన్ననే(డిసెంబర్ 5) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఈ పాటికి హిట్టో, ఫ్లాపో అనే విషయం కూడా తెలిసిపోయేది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రీమియర్స్‌ని రద్దు చేసిన నిర్మాతలు.. ఆ తర్వాత కొన్ని గంటలకే సినిమా విడుదలనే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.
వాయిదా కామన్ కానీ..
సినిమా విడుదల వాయిదా అనేది ఇండస్ట్రీలో కామన్. అనుకున్న తేదికి రిలీజ్ కానీ సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు దాదాపు అనుకున్న తేదికి రిలీజ్ కావు. షూటింగ్ ఆసల్యం అవ్వడం లేదా.. ఓటీటీ బిజినెస్ కాకపోవడం..ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.. ఇలా వివిధ కారణాలతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే అవన్నీ వాయిదా వేసిన విషయం కనీసం రిలీజ్‌కి వారం, పది రోజలు ముందే చెప్పేవి.
కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని..కొన్ని గంటల్లో థియేటర్స్‌కి రావాల్సిన సినిమా..ఆగిపోవడం అనేది ‘అఖండ 2’(Akhanda 2) విషయంలో మాత్రమే జరిగింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఇప్పటి వరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నామని చెప్పినప్పటికీ.. 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిందనే విషయం దాచలేని సత్యం.
అలెర్ట్ కాకపోతే ఇబ్బందులు తప్పవు!
ఫైనాన్స్ ఇష్యూలతో సినిమా రీలీజ్ ఆలస్యం అవడం అనేది ఇండస్ట్రీలో తరచు జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీ పెద్దలు చొరవ చేసుకొని సమస్యలను పరిష్కరించి రిలీజ్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరిగింది. చివరి నిమిషయంలో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో సినిమా విడుదల అయింది. అఖండ 2 విషయంలోనూ అదే జరుగుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ సంఘటన టాలీవుడ్‌కి ఓ గుణపాఠం అనే చెప్పాలి. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే సినిమాను విడదల చేయాలి.
అంతేకానీ ఫైనాన్షియల్ ఇష్యూని తేలిగ్గా తీసుకొని.. తర్వాత చూసుకుందాంలే అని వస్తే మాత్రం..‘అఖండ 2’ పరిస్థితే వస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతలు చేతులు ఎత్తేస్తారని తెలిసి..కొంతమంది ఫైనాన్షియర్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఏదైనా ఉంటే రిలీజ్‌కు ముందే చూసుకోవాలని వారి ఆలోచన. ఇక్కడ వారిని కూడా తప్పుపట్టలేం. ఇలాంటి సమస్యలను నిర్మాతలు రిలీజ్‌కు ముందే పరిష్కరించుకుంటే మంచిది. లేదంటే ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది.


