బాలకృష్ణ- బోయపాటి శ్రీను అఖండ2 సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.. దీంతో పలు రకాలుగా కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. అఖండ2 గురించి తప్పుడు వార్తలు రావడం దురదృష్టకరమని అన్నారు. శ్రీనందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో సురేశ్ బాబు పాల్గొన్నారు. అఖండ 2 గురించి మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడారు.
'అఖండ2 విడుదల అవుతుందని ఆశతో ఉన్నాం. ఆ సినిమా కోసం బ్యాక్ ఎండ్‌లో చాలామంది కష్టపడుతున్నారు. గతంలో చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారమవుతుంది అనుకుంటున్నాను. నేను కూడా ఆ సమస్యను క్లియర్ చేద్దామని వెళ్లాను. దీంతోనే ఈ కార్యక్రమానికి రావడం కాస్త ఆలస్యమైంది. ప్రతి సినిమా విషయంలో కొన్ని ఆర్థికపరమైన చిక్కులు ఉంటాయి. వాటిని ఎవరూ బయటకు వెల్లడించకూడదు.
అయితే, కొందరు వారికి నచ్చినట్లు కథనాలు రాసేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల గురించి తమకు తోచినట్లుగా రాస్తున్నారు. అఖండ2 వాయిదా పడటానికి ఇన్ని కోట్లు అటా.. అసలు కారణం ఇదే.. వంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. తప్పకుండా మంచి వార్తే అందుతుంది.' అని సురేశ్ బాబు అన్నారు.


