తొలి సినిమాతో 'సింహరాశి'తోనే ఇండస్ట్రీలో తన పేరు మారుమోగిపోయేలా చేశాడు దర్శకుడు వి. సముద్ర. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, ఎవడైతే నాకేంటి, మహానంది, పంచాక్షరి.. ఇలా ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విశేషాలను పంచుకున్నాడు.
లారెన్స్‌ను పరిచయం చేశా..
సముద్ర మాట్లాడుతూ.. మొదట్లో అనేకమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చిరంజీవి హిట్లర్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సమయంలోనే చిరంజీవికి తొలిసారి లారెన్స్‌ను పరియం చేశాను. 'అబీబీ అబీబీ..' పాటలో సిగ్నేచర్ స్టెప్పును లారెన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమా తర్వాత లారెన్స్ వెనక్కు తిరిగి చూసుకోలేదు.
నాగార్జున పిలిచి మరీ..
అనుష్కతో నేను పంచాక్షరి సినిమా తీశాను. నాగార్జున (Nagarjuna Akkineni) మేకప్‌మెన్ చంద్ర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించాడు. నాగార్జున నన్ను ఓసారి గోవాకు పిలిచి.. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అరుంధతి తీశాడు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్.. ఇక్కడుంది చంద్ర, నా మేకప్‌మెన్. అంత పెద్ద నిర్మాత కాదు. వీడి లైఫ్ జాగ్రత్త.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నాగార్జున తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా బాగా చూసుకుంటాడు.
గోరుముద్దలు
మహానంది సమయంలో అనుష్క (Anushka Shetty) నాకు గోరుముద్దలు పెట్టేది. అప్పుడెలా అన్నం తినిపించిందో పంచాక్షరి సమయంలోనూ అలాగే ప్రేమగా తినిపించింది. అలా నాకు గోరుముద్దలు పెట్టిన హీరోయిన్లు మరెవరూ లేరు. తర్వాత తను స్టార్ హీరోయిన్‌గా మారాక తన నడవడికలో కొంత తేడా వచ్చినట్లు అనిపించింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ తను చాలా మంచి అమ్మాయి అని సముద్ర (V Samudra) చెప్పుకొచ్చాడు.


