ఈరోజుల్లో ప్రేమపెళ్లి అనేది కామన్. కానీ భిన్న వర్గాలవారు పెళ్లి చేసుకుంటేనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ అలాంటి ట్రోలింగ్ బారిన పడింది. ఈమె జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి పెళ్లాడింది. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే తమ లవ్‌స్టోరీలో కూడా చాలా గొడవలు జరిగాయంటోంది.
గొడవలు
సోనాక్షి మాట్లాడుతూ.. మేము మూడేళ్లపాటు ప్రేమలో ఉన్నాక మామధ్య చాలా గొడవలు జరిగాయి. ఎంతలా అంటే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని పీక్కునేంతలా! అసలు ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకోలేకపోయాం. అలా అని విడిపోవాలనుకోలేదు. దీన్ని పరిష్కరించుకోవాలనుకున్నాం.
నెగెటివ్‌గా చూడొద్దని..
కపుల్స్ థెరపీకి వెళ్దామని జహీర్ ఐడియా ఇచ్చాడు. ఈ ఆలోచనేదో బాగుందనిపించింది. రెండు సిట్టింగ్స్‌లోనే మా మధ్య గొడవలు పరిష్కారమయ్యాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ప్రతీది నెగెటివ్‌గా చూడకూడదని తెలుసుకున్నాం అని చెప్పుకొచ్చింది. అలా ఏడేళ్లు ప్రేమలో మునిగి తేలిన సోనాక్షి (Sonakshi Sinha), జహీర్ 2024 జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
సల్మాన్ పార్టీలో తొలిసారి..
ఇకపోతే వీరిద్దరూ డబుల్ XL (2022) అనే మూవీలో నటించారు. అంతకంటే ముందు వీరు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన పార్టీలో కలిశారు. తర్వాత 2017లో ట్యూబ్‌లైట్ ప్రీమియర్‌లో మరోసారి కలుసుకున్నారు. అప్పుడే సరదాగా ఐదుగంటల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడే ఈ బంధం ఏదో స్పెషల్‌గా ఉందని సోనాక్షికి అర్థమైంది. తర్వాత అదే నిజమై వైవాహిక బంధంగా మారింది. సోనాక్షి చివరగా జటాధర అనే తెలుగు మూవీలో నటించింది.


