
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదన్నట్లు జోరుగా షూటింగ్స్ చేస్తారు స్టార్స్. అలాంటివారికి హఠాత్తుగా బ్రేక్ వస్తే... ఓ నాలుగైదు రోజులు బాగానే ఉంటుంది. కానీ దాదాపు 20 రోజులు బ్రేక్ వస్తే... ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌కి పోదామా అని వెయిట్ చేస్తారు. తెలుగు చలన చిత్ర కార్మికుల సమ్మె కారణంగా ఆ మధ్య దాదాపు 20 రోజులు బ్రేక్ రావడం, ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ మొదలు కావడంతో ‘జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా’ అంటూ భాగ్యనగరంలో కొందరు స్టార్స్ షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. ఆ విశేషాలు...
స్పీడుగా శంకరవరప్రసాద్
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో వెంకటేశ్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్యాథరిన్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. కాగా ఆగస్టు 5న ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ సినీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది.
తాజాగా ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవితో పాటు ఈ చిత్రంలోని కీలక తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్‌లోనే చిరంజీవి–వెంకటేశ్ కాంబినేషన్‌లో కూడా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, వీరి కాంబినేషన్‌లోనే ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను కూడా చిత్రీకరించాలని ఈ చిత్రదర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని తెలిసింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
అయితే కార్మికుల సమ్మె కారణంగా ఒక షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యమైంది కనుక ఇకపై పెద్దగా బ్రేక్స్ లేకుండా స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను నిలపాలని ఈ చిత్రయూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ చిత్రంలో శంకరవరప్రసాద్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర ఉంటుంది. చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెంకటేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
చలో గ్రీస్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్, నిధీ అగర్వాల్ హీరోయిన్లు్లగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే గ్రీస్ వెళ్లనుందట ‘ది రాజాసాబ్’ చిత్రయూనిట్. అక్కడ పాటలు చిత్రీకరించనున్నారట.
ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్ చూసొచ్చారట. ఈ గ్రీస్ షెడ్యూల్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని సమాచారం. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా విశ్వప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఇక ‘ది రాజాసాబ్’ సినిమాలో సంజయ్ దత్, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తాత–మనవళ్లుగా సంజయ్ దత్–ప్రభాస్ కనిపిస్తారని టాక్.
విదేశాలకు డ్రాగన్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగు తోందని తెలిసింది. ఎన్టీఆర్ షూట్‌లో పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్.
అయితే ఈ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ విదేశాల్లో ప్లాన్ చేశారని, ఈ దిశగా ఏర్పాట్లు కూడా మొదలై పోయాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్‌నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో ఉంటుందని, ముఖ్యంగా కోల్‌కత్తా ప్రస్తావన ఉంటుందని తెలిసింది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.
మాస్ జడల్...
ఒక హిట్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రూ పొందితే ఎన్ని అంచనాలు ఏర్పడతాయో అన్నీ ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఉన్నాయి. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత ఆ చిత్రకథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో రూ పొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్‌లో ఓ లుక్‌లో నాని రెండు జడలు వేసుకుని కనిపించారు. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.
కాగా... సినిమాలో నాని వేసుకునే జడలకు, ఈ చిత్రదర్శకుడు శ్రీకాంత్ ఓదెల జీవితానికి చిన్న కనెక్షన్ ఉందట. శ్రీకాంత్ ఐదో తరగతి వరకూ అతని తల్లి ఇలా రెండు జడలు వేసి స్కూల్‌కి పంపించేవారట. ఇది మాత్రమే కాదు... నాని క్యారెక్టర్‌కి జడలు వేయడం వెనక వేరే కారణం ఉందట. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని ఆ మ«ధ్య ఓ సందర్భంలో శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక జడల్ పాత్రలో నాని ఫుల్ మాస్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
శంకర్‌పల్లిలో...
హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతుంటారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలు కమిట్ అవడంతో పాటు సెట్స్‌పైకి తీసుకెళుతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌టీ 76’ (వర్కింగ్ టైటిల్). కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూ పొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ కాకుండా ఉండేలా కథను సిద్ధం చేశారట కిశోర్ తిరుమల.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌కి సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ కొనసాగుతోందట. రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కిశోర్ తిరుమల. శరవేగంగా ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసి, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉందట యూనిట్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు.
‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి.
ముచ్చింతల్‌లో...
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది.
ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా, ఆయన వీరాభిమాని పాత్రలో రామ్ నటిస్తున్నారు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్ది రోజులు షూటింగ్స్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముచ్చింతల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట పి. మహేశ్‌బాబు. వివేక్–మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘పప్పీ షేమ్...’ అంటూ సాగే పాటని ఈ నెల 8న విడుదల చేయనున్నారు.
మిస్టిక్ థ్రిల్లర్...
‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు హీరో నాగచైతన్య. అంతేకాదు... తొలిసారి ఆయన వంద కోట్ల క్లబ్‌లో చేరారు. అలాంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌సీ 24’ (వర్కింగ్ టైటిల్). ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ (2023) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.
బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూ పొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్ రూ పొందించారు మేకర్స్. ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ లుక్ కోసం ఆయన శారీరకంగా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. అలాగే మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర ముఖ్యమైన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట కార్తీక్ వర్మ.
మాదాపూర్‌లో...
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాలతో ఆయనకంటూ ప్రత్యేకమైన మేనరిజమ్‌ని, యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారాయన. సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరుగుతోంది. సిద్ధు శైలి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూ పొందుతోన్న ఈ చిత్రంలో మనసుని హత్తుకునే భావోద్వేగాలు, అనుబంధాలు కూడా ఉంటాయట. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే... ఈ దీపావళికి సిద్ధు జొన్నలగడ్డ నవ్వుల మతాబులు పేల్చనున్నారన్నమాట.
కొనసాగుతున్న సంబరాలు
సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా రూ పొందుతున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ (2024) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఎస్‌వైజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది.
ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ‘బ్రో’ సినిమా 2023 జూలై 28న విడుదలైంది. అప్పటి నుంచి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు సాయిదుర్గా తేజ్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి కానందున మరోసారి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
బూత్ బంగ్లాలో...
అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా (2023) తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూ పొందుతోన్న ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారి పోయారు అఖిల్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్. కాగా ఈ సిని మాలో హీరోయిన్‌గా తొలుత శ్రీలీల ఫిక్స్ అయ్యారు. కార ణాలు తెలియదు కానీ ఆమె స్థానంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారని టాక్.
ముచ్చింతల్‌లో మహా కాళి
‘హను–మాన్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని, అదే స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారాయన. ఈ యూనివర్స్‌లో వచ్చిన తొలి చిత్రం ‘హను–మాన్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా రూ పొందుతోన్న సినిమా ‘మహా కాళి’. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌కేడీ స్టూడియోస్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఇది.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూ పొందుతోంది. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్న లుక్ వైరల్‌గా మారింది. మరి... ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి ఉండాలి.
పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సందడి సందడిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల
జగన్ మోహన్