
నేర్చుకోవాలనే అంతులేని తపనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు కొందరు. పైగా మంచి ఉన్నత పొజిషన్‌లో పనిచేసి పదవీ విరమణ పొందాక కూడా విద్యను అభ్యసించడం అంటే మాటలు కాదకదా..!. చదవాలన్న కోరిక ఉన్నా..వయసు సహకరించదు. పోనీ కొత్తగా ఆ స్పీడ్ టెక్నాలజీని అందుకుంటూ చదవాలంటే వామ్మో అనేస్తారు ఎవ్వరైనా..కానీ ఈ 80 ఏళ్ల మహిళ వాటన్నింటిని ఖతారు చేస్తూ..దిగ్విజయంగా ఎంబిఏ పూర్తి చేసింది. రెండుసార్లు కేన్సర్‌తో పోరాడి గెలిచి కూడా..ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగి..నేటి యువతకు ఆదర్శంగా నిలిచారామె.
ఆ మహిళే 80 ఏళ్ల ఉషా రే(Usha Ray). పూణేలోని పాటిల్ విద్యాపీఠ్ సెంటర్ ఫర్ ఆన్‌లైన్ లెర్నింగ్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో MBA కోసం చేరినప్పుడు ఆమె వయసు 77 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టుకి 80 ఏళ్లు వచ్చిన రెండు వారాలకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారామె. నిజానికి ఈ సబ్జెక్టు ఆమెకు కొత్త. ఎందుకంటే ఆమె జంతుశాస్త్రంలో ఎంబిఏ చేశారు.
దశాబ్దాలుగా పాఠశాల ఉపాధ్యాయురాలిగా కొనసాగిన అనుభవం ఉందామెకు. ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాస్త్రం అర్థం చేసుకోవడం, కంప్యూటర్‌తో కుస్తీ పట్టడం అన్ని సవాళ్లే ఆమెకు. అయినా..తగ్గేదే లే అంటూ ఎంబీఏ చేసేందుకు ఉత్సాహం చూపించిందామె. ఆమె ఇంగ్లాండ్, యోమెన్ వంటి అంతర్జాతీయ పాఠశాలల్లో భోధించారు కూడా. ప్రస్తుతం ఆమె లక్నోలో గోమతినగర్‌లోని లవ్ శుభ్ హాస్పిటల్ సీఈవోగా పనిచేస్తున్నారు.
ఈ కోరిక ఎలా పుట్టిందంటే..
2009లో టీచింగ్ వృత్తి నుంచి పదవీ విరమణ చేశాక..ఆస్పత్రిలో సీఈవోగా పనిచేస్తున్నప్పుడు ఈ కోరిక కలిగిందామెకు. అక్కడ చాలామంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడూ..ప్రతిచోట ఎంబీఏ అని కనిపించేదట ఆమెకు. అందరూ చేసే ఈ ఎంబీఏ ఏంటి?..ఎలాగైనా తెలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు ఉషా రే. అలా 2023లో ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరింది. అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబధించిన విభాగంలో చేయడం ఆమె ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు.
అంతేగాదు ఆమెకు 2003లో స్టేజ్-4 ఛాతీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెలల కీమోథెరపీ, రేడియో థెరపీతో కోలుకుంది. మళ్లీ మహమ్మారి సమయంలో కేన్సర్ తిరగబెట్టింది. మళ్లీ ధైర్యంగా ఎదుర్కొంది. ఇన్ని ఆటోపోట్లు చూసినా ఆమె వెనక్కి తగ్గకుండా ఎంబిఏ చేయాలనుకోవడం విశేషః. ఇక్కడ ఉషా రే ఎదురుదెబ్బ తగిలినప్పుడే జాగ్రత్తగా ఉండాలే తప్ప భయంతో అస్సలు ఆగిపోకూడదు అంటారామె. చివరగా దిగ్విజయంగా ఎనిమిది పదుల వయసులో ఎంబీఏ చేయగలిగానంటే అదంతా తన కుటుంబం, సహోద్యోగుల అందించిన ప్రోత్సాహమే అంటూ క్రెడిట్ అంతా వాళ్లకే ఇచ్చేశారు ఉషారే.
(చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్)