విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు.
అతడే అభిజయ్ అరోరా. భారత్‌కి చెందిన అభిజయ్ చక్కగా స్విట్జర్లాండ్‌లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్‌తో చదవాలనే డ్రీమ్‌తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు.
ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్ లేకుండా హార్వర్డ్‌లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్ కూడా రాలేదు. తనకున్న జాబ్ నెట్‌వర్కింగ్ కూడా హెల్ప్ అవ్వలేదు.
ఏ జాబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్ (యూట్యూబ్)లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్‌ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది.
పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్ చేసుకున్నాడు అరోరా.
ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్ జాబ్‌ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్ అని పోస్టులు పెట్టారు.
(చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..)


