సోషల్ మీడియా ఎంత కమ్ముకున్నా పుస్తకం పునరుత్థానం అవుతూనే ఉంది. పుస్తక పఠనానికి కొత్త దారులు పడుతున్నాయి. ఏదైనా మంచి చోటుకు విహారంగా వెళ్లి పుస్తకం చదువుకుంటూ కూచోవడం ట్రెండ్‌గా మారింది. దానినే ‘రీడింగ్ రిట్రీట్’ అంటున్నారు. ఒక్కరూ, లేదా కొద్దిమంది ఏదైనా చోటుకు వెళ్లి పుస్తకాలు చదువుకుంటూ రిలాక్స్ అవుతున్న ఈ ధోరణిపై వీకెండ్ కథనం.
రోజూ పనులు, హడావిడి, తీరిక లేని శ్రమ, మొహం మొత్తే పరిసరాలు... వీటి మధ్య నుంచి పారిపోయి, ఎటైనా ఏకాంత ప్రదేశంలో హాయిగా వీకెండ్స్ గడపాలనిపిస్తుంది ఎవరికైనా. అలా గతంలో చేసే వారు. ఇప్పుడూ చేస్తున్నారు. అయితే అలా వెళ్లి సరదాగా తిరగడమో, పార్టీ చేసుకోవడమో, షాపింగ్ చేయడమో కాకుండా ఏ పనీ చేయకుండా పుస్తకాలు చదువుకుంటూ కూచోవాలనుకుంటున్నారు కొందరు.
ప్రశాంతమైన చోటుకు వెళ్లి అంతే ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ గడపే ట్రెండ్ పేరు ‘రీడింగ్ రిట్రీట్’. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎంతోమంది పాఠకులను ఒకచోట చేరుస్తోంది. కొందరు ఆపరేటర్లు ప్రత్యేకంగా కొన్ని చోట్లను ఇందుకై తయారు చేసి మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చదువుకోండి అని కూడా ‘ప్యాకేజ్’లు ఆఫర్ చేస్తున్నారు. వాళ్లు పెట్టే తిండి తింటూ హాయిగా చదువుకుని తిరిగి ఇల్లు చేరడమేనన్నమాట.
రీడింగ్ రిట్రీట్‌కు ఎందుకు వెళ్లాలి?
ఆధునిక జీవితంలో వేగాన్ని తగ్గించడం అంత సులభం కాదు. రోజూ ఏదో పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు... ఇంకా చాలా చాలా. వీటి మధ్య తీరిగ్గా పుస్తకం చదివే అవకాశం దొరకదు. సెలవుల్లో అలాంటి ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. లేదా చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉండదు. తర్వాత చదువుదాం, తర్వాత చూద్దాం అని పుస్తక పఠనాన్ని వాయిదా వేస్తుంటారు. ఆ వాయిదాను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కొందరు ఈ రిట్రీట్ ధోరణిని తీసుకొచ్చారు.
రీడింగ్ రిట్రీట్ ఎక్కడ అనుకూలం?
నగర జీవితంలోని రణగొణధ్వనులకు దూరంగా ఎక్కడైనా రీడింగ్ రిట్రీట్ జరుపుకోవచ్చు. ఊరి చివరి ఖాళీ ప్రదేశాలు కావొచ్చు. ప్రశాంతమైన అటవీ మార్గాలు కావొచ్చు. ఎతై ్తన కొండలు, సముద్రతీరాలు కావొచ్చు. ఊరి సమీపంలోని రిసార్ట్‌లు కావొచ్చు. మీకు అనుకూలమైన ప్రదేశాలు దీనికి ముఖ్యం. ఎటొచ్చీ ఎక్కువగా జనం వచ్చే ప్రదేశాలు, సులభంగా పట్టణాలను చేరే ప్రాంతాలు లేకపోవడం మేలు. అలా ఉంటే మనసు మన మాట వినదు. కనీసం ఐదారు గంటలు అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనే చోటను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మధ్యలో భోజనం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంతం ఉండాలి.
రీడింగ్ రిట్రీట్‌లో ఎంతమంది?
ఈ రీడింగ్ రిట్రీట్‌లో ఇంతమంది ఉండాలన్న నిబంధనేమీ లేదు. ఇద్దరితో మొదలుకొని ఎంతమందైనా ఉండొచ్చు. అయితే వారంతా పాఠకులై ఉండాలి. మీరంతా కలిసి ఒకచోటును ఎంపిక చేసుకొని, అక్కడికి వెళ్లి, ఎవరి పుస్తకంలో వారు మునిగిపోవచ్చు. అయితే నిజంగా పఠనం మీద ఆసక్తి ఉన్నవారినే ఎంచుకోవడం ఉత్తమం. అప్పుడే మీకు ఇబ్బంది ఉండదు. ఇటీవల కాలంలో రీడింగ్ రిట్రీట్‌ను ఏర్పాటు చేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మీరంతా ఒక బృందంగా ఏర్పడి, వారిని సంప్రదిస్తే మీ సంఖ్య, అభిరుచికి తగ్గట్లు వారే ఓ ప్రాంతాన్ని సూచించి, అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తారు.
ఇవి చేయడం తగదు
→ పుస్తక పఠనంపై ఆసక్తి లేకుండా రీడింగ్ రిట్రీట్‌కు వెళ్లడం సరికాదు. దీనివల్ల పక్కవారి ఏకాగ్రతను దెబ్బతీసినట్లు అవుతుంది.
→ ఒక్కొక్కరు ఒక్కోరకమైన సాహిత్యాన్ని ఇష్టపడతారు. అక్కడికి వెళ్లాక ఈ విషయంలో ఎవరితోనూ వాదించకూడదు.
→ మీరు ఎన్ని పుస్తకాలు చదవగలరో అన్ని తీసుకెళ్లాలి. అక్కడికి వెళ్లాక పుస్తకాల కోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు. లేదా వారి అనుమతితోనే వారి పుస్తకాలు తీసుకోవాలి.
→ అక్కడికి వెళ్లాక ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి వాడకూడదు. అది ఆ కార్యక్రమం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ ఆఫ్ చేయలేకపోతే సైలెంట్ మోడ్‌లో పెట్టాలి.
→ ఇతరులతో వాదించడం, గట్టిగా చర్చించడం, ఇతరులు చదువుతున్న పుస్తకాలను హేళన చేయడం, పుస్తకంలోని అంశాలను ముందుగానే వివరించడం, వాటి గురించి తేలిగ్గా మాట్లాడటం అస్సలు చేయకూడదు.


