
పవిత్ర క్షేత్రాన్ని సొంత కార్యాలయంగా మార్చిన టీటీడీ చైర్మన్
తిరుమలలో టీవీ–5 రిపోర్టర్ ఆకతాయి చేష్టలు
మహాద్వారం గ్రిల్ తాళాలు విలేకరి చేతికి
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్ గేట్‌వద్ద టీవీ–5 ఉద్యోగి శ్యామ్‌నాయుడు చిల్లర వేషాలు వేశారు. ‘అంతా విష్ణుమాయ’ అంటూ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయానికి తాను తాళాలు వేస్తున్న ఫొటో, వీడియో శ్యామ్‌నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
కాగా, తానేదో టీటీడీ ఉద్యోగస్తుడైనట్టు.. టీటీడీకి బీఆర్ నాయుడే రాజుగా వ్యవహరిస్తున్నట్టున్న వారి ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఇదేం పనులు అంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమేమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్ గేట్ తాళాలు టీవీ–5 రిపోర్టర్ చేతికి ఎలా వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టీవీ–5 చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమల కొండపై టీవీ–5 సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల కొండపై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తున్న టీటీడీ అధికారులు తాజా ఘటనపై నోరెత్తకపోవడం కూడా చర్చనీయాంశమైంది. కేవలం టీవీ–5 ఉద్యోగి కావడం వల్లే శ్యామ్‌నాయుడుపై కేసు నమోదు చేయలేదని, ఇంత పెద్ద తప్పు చేసినా బీఆర్ నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు.
తిరుమల ఆలయం మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా?#AndhraPradesh #viral #trending pic.twitter.com/jtnwFwJvX3
— Andhra Insights (@AndhraInsights) September 10, 2025