కిరాణా షాపులో అపరాలు
నిడదవోలు: ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలతో పప్పు ధాన్యాలు, అపరాలు, పంచదార కూడా కొనలేని పరిస్థితితో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ వారం మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలను పరిశీలిస్తే ప్రతి వస్తువుపై కిలో రూ.10 నుంచి రూ.30లు పెరగడంతో పప్పుల జోలికే సామాన్య, మధ్య తరగతి ప్రజలు వెళ్లలేకపోతున్నారు. నూనె ధరలు పెరగడం కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయని వారు వాపోతున్నారు.
ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు
పట్టణంలో ఉన్న పలు దుకాణాల్లో వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక షాపులో ఉన్న ధర మరొక షాపులో ఉండట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వారికి ఇష్టం వచ్చిన ధరలకు అపరాలు, నిత్యవసరాలు విక్రయిస్తున్నా పౌర సరఫరాల శాఖాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ తగ్గినా పాత ధరలే..
నిత్యవసరాలు సరకులపై జీఎస్టీ తగ్గినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం తగ్గించిన కొత్త స్లాబులు అమలుకు నోచుకోవడం లేదు. మార్కెట్లో నిత్యావసరాల వస్తువులను పాత ధరలతోనే అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఇదే పరిస్థితి నెలకొనడంతో కొందరు వ్యాపారులు జీఎస్టీ తగ్గింపు విధానాన్ని బహిష్కరించినట్లుగా కనిపిస్తుంది.
కొందరు ఉద్యోగులు, విద్యావంతులు సరకుల ధరలు, సబ్బులు, వంట నూనెలపై జీఎస్టీ తగ్గించాలని వ్యాపారస్తులను ప్రశ్నిస్తున్నా.. వంట నూనెలకు జీఎస్టీ తగ్గించలేదని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఆన్‌లైన్‌లో ఒక రకం ధరలు క్షేత్రస్థాయిలో మరో రకం ధరలు అమలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
కానరాని నిబంధనలు
ప్రతీ దుకాణం వద్ద తగ్గిన నిత్యావసర ధరలను ప్రదర్శించాలని జిల్లా అధికారులు సంబంధిత కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దుకాణాదారులను ఆదేశించారు. అయితే, చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యాపారులు, దుకాణదారులు అసలు జీఎస్టీ ఊసే ఎత్తడం లేదు. ధరల వ్యత్యాసాలపై ఎవరైనా వినియోగదారుడు వ్యాపారులను ప్రశ్నిస్తే ఇంకా అమలు కావడం లేదని, అమలు తర్వాత జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుందని కొనుగోలుదారులను నిలువునా ముంచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ధరల దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోతుందని మధ్య తరగతి, పేద ప్రజలు వాపోతున్నారు.
కందిపప్పు ఇవ్వకపోవడంతో..
కందిపప్పు ధరలు ఆకాశానంటుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న కందిపప్పును ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం నిలిపివేసింది. రేషన్ షాపుల్లో తెలుపు కార్డుదారులకు కిలో రూ.67 కందిపప్పు అందించేవారు. అయితే, గత 10 నెలల నుంచి కందిపప్పు ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ¯ð లబ్ధిదారుడు కందిపప్పు తీసుకునేందుకు రేషన్ షాపులకు వెళ్లగా.. కందిపప్పు ఇవ్వడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
నిడదవోలు పట్టణంలో 11,208, పెరవలి మండలంలో 22,463, ఉండ్రాజవరం మండలంలో 21,912, నిడదవోలు మండలంలో 23,912 తెలుపు కార్డులు ఉన్నాయి. ఇలా ప్రతీ వస్తువుపై ధరలు పెరిగిపోవడం పనులు లేక కూలీలు, పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఆదాయ వనరుల బట్టి కుటుంబ పోషణకే కష్టమవుతున్న పరిస్థితుల్లో ఆడంబరాలకు దూరంగా బాధతో ఉంటున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వాలి
ధరలు పెరిగిపోవడంతో ఏమీ కొనలేక పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కందిపప్పును రేషన్ షాపుల్లో తక్కువ ధరకు ఇవ్వాలి. జీఎస్టీ ధరలు ఎక్కడా కూడా అమలు చేయడం లేదు. పేదలు పప్పులు కొనాలంటేనే ధరలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీ పనులు చేసుకునే మాలాంటి వాళ్లం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం.
– మర్రిపూడి విజయ, గృహిణి, నిడదవోలు.


