అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పాలన గాడితప్పింది. దశాబ్దాలుగా పారిశుధ్య పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులపై ‘పద్మావతి ఏజెన్సీ’ కత్తిగట్టింది. వయసు, విద్యార్హత ఆంక్షల పేరుతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 50 ఏళ్లు వయసు పైబడిన వారు ఉద్యోగాలకు అవసరం లేదని తెగేసి చెప్పింది. జీవనాధారం కోల్పోతే కుటుంబ పోషణ ఎలా అన్న మానసిక క్షోభ కార్మీకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ క్రమంలో కార్మీకులు తమ జీవనాధారాన్ని దెబ్బ తీయొద్దంటూ ఏజెన్సీ నిర్వాహకులను ప్రాధేయపడ్డారు. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ వారియర్స్‌గా పనిచేసిన తమకు ఇదేనా మీరిచ్చే గుర్తింపు అని ప్రశ్నిస్తే.. కర్కశంగా సమాధానమిచ్చారు. మీరెటైనా చావండి.. మేము ఇతరులను పనిలోకి తీసుకుంటున్నాం అని తెగేసి చెప్పడంతో గుండె ఆగినంత పనైంది.
ఎప్పుడు తమకు డ్యూటీ చివరి రోజు అవుతుందోనని భయం భయంతో విధులకు హాజరవుతూ రెండు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకుల బెదిరింపులతో మనస్తాపం చెందిన పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. 
చేతులెత్తేసిన అధికార యంత్రాంగం..
పారిశుధ్య కార్మీకుల సమస్యతో సర్వజనాస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన పారిశుధ్యంపై అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. నిబంధనల మేరకు కార్మీకులపై చర్యలుంటాయని, స్టేట్ పాలసీ అంటూ మాట దాటవేస్తున్నారు. దీనికి తోడు ఏజెన్సీ నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రులని, ఈ విషయంలో తామేమి చేయలేమని అధికారులే బహిరంగంగా చెబుతుండడం దుమారం రేపుతోంది. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవ్వరూ కార్మికుల సమస్యను పట్టించుకోలేదు.
దుర్వాసన వెదజల్లుతున్న వార్డులు..
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శనివారం పారిశుధ్య కార్మీకులు విధులకు గైర్హాజరయ్యారు. రోజుకు మూడు, నాలుగుసార్లు శుభ్రం చేయాల్సిన వార్డులను ఒక్కసారి కూడా శుభ్రం చేయలేదు. ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్, ఐసీసీయూ, పీఐసీయూ, గైనిక్, లేబర్, ఆర్థో, మెడిసిన్, ఈఎన్‌టీ, ఆపరేషన్ తదితర వార్డులన్నీ దుర్వాసన వస్తున్నాయి. ఇప్పటికే శానిటేషన్ నిర్వాహకులు కనీసం డస్ట్‌బిన్లు, కవర్లను ఇవ్వలేదు. దీంతో రోగికి వినియోగించిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. పారిశుధ్యం నిర్వహణకు గాను ప్రతి నెలా రూ.70 లక్షలు ఏజెన్సీకి చెల్లించేలా ఒప్పందంలో ఉంది.
జీవనాధారం పోతే ఏం కావాలి?
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాం. పారిశుధ్య పనులు చేస్తూ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇప్పటికే నా భర్త కృష్ణా నాయక్, బిడ్డ కవిత, అల్లుడు నాగరాజు చనిపోయారు. మనవడు, మనవరాలు గంభీర్ (డిగ్రీ), గంగోత్రి (9వ తరగతి) ఆలనా, పాలన నేనే చూసుకోవాలి. ఇప్పుడేమో ఏజెన్సీ వాళ్లు పని నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. నాకుటుంబానికి ఆధారమంతా ఇదే సార్. వచ్చే డబ్బులతోనే వారిని చదివించుకుంటున్నా. ఇప్పటి వరకు ఐదారు ఏజెన్సీలు వచ్చాయి. పద్మావతి ఏజెన్సీ అంత ఘోరంగా ఎవరూ సతాయించడం లేదు.
– కాంతమ్మ, పారిశుధ్య కార్మికురాలు
ఇంతలా అంగలాపిస్తే ఎలా..?
నేను, నా భర్త సిరాజ్ ఉంటున్నాం. ఆయన ఏ పనీ చేయలేని పరిస్థితి. 12 ఏళ్లుగా సర్వజనాస్పత్రిలో పని చేస్తున్నా. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కుటుంబం గడుస్తుంది. ఈ వయసులో ఉద్యోగం లేదని, పనికి రావొద్దని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేశాం. ఇప్పుడు ఉన్నఫళంగా వెళ్లిపొమ్మంటే ఏం చేయాలి. ఇంత అంగలాపిస్తే ఎలా? ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు మాతోటి స్వీపర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీళ్లు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు?
– షమీమ్, పారిశుధ్య కార్మీకురాలు
ఏజెన్సీ ముసుగులో దురుసు ప్రవర్తన..
ఈ నెల 12న పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలి పట్ల పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజరెడ్డి దురుసుగా మాట్లాడారు. చస్తే చావు అంటూ కర్కశంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన పద్మావతి చిన్నపిల్లల విభాగం అంతస్తుపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతోంది.
⇒ సర్వజనాస్పత్రిలో ఏజెన్సీ నిర్వాహకులు, పారిశుధ్య కార్మీకులకు మధ్య 20 సార్లకుపైగా వాగ్వాదం జరిగింది. పదుల సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు. నెల రోజులుగా కార్మీకులు తమకు న్యాయం చేయాలంటూ రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు.
⇒ పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికే 50 మంది వరకు సూపర్‌వైజర్లు, పారిశుధ్య కార్మీకులను విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారిని విధుల్లోకి పురమాయించినట్లు తెలుస్తోంది. దీనికితోడు పారిశుధ్య కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఏజెన్సీ మేనేజర్లు ఆస్పత్రిలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నా రు. ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అనే ఆలోచనలో నిమగ్నమయ్యారు.
కార్మీకురాలికి పరామర్శ
ఏజెన్సీ మేనేజర్లు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు పరామర్శించారు. కార్మీకులందరికీ యూనియన్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, కార్యదర్శి బి.రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్‌గౌడ్, నగర కార్యదర్శి రామాంజి రాయల్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హుస్సేన్, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.


