అక్షర ప్రియ | Priyanka Chopra has recommended books | Sakshi
Sakshi News home page

అక్షర ప్రియ

Sep 13 2025 1:34 AM | Updated on Sep 13 2025 1:34 AM

Priyanka Chopra has recommended books

బుక్‌ కార్నర్‌

నటిగా సుపరిచితురాలైన ప్రియాంక చోప్రా సింగర్, రైటర్‌ కూడా. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న ప్రియాంక, తాను చదివిన పుస్తకాల గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘మీరు ఈ పుస్తకాలు చదివితే బాగుంటుంది’ అంటూ కొన్ని పుస్తకాల పేర్లు సూచించింది. అవి...

వాయిసెస్‌ ఆఫ్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌– జోయి సలీస్‌
లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌ – నెల్సన్‌ మండేల
హోమ్‌గోయింగ్‌  –యా గ్యాసీ
అన్‌టేమ్‌డ్‌  –గ్లెనన్‌ డోయల్‌

లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌ 
నెలన్స్‌ మండేల అనే పేరులోనే పిడికిలి బిగించిన దృశ్యం ఆవిష్కారం అవుతుంది. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని సంవత్సరాలు జైలుపాలైనా ఎప్పుడూ రాజీపడలేదు. మడమ తిప్పలేదు. జాత్యహంకారంపై నిరంతర పోరాటం చేశాడు. ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌’ ఆయన జీవితానికి అద్దం పట్టే పుస్తకం. బాల్యం నుంచి అధ్యక్షుడి వరకు మండేలా జీవితంలోని ఎన్నో ఘట్టాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

హోమ్‌ గోయింగ్‌
యా గ్యాసీ రాసిన ‘హోమ్‌గోయింగ్‌’ కాల్పనిక చారిత్రక నవల. బ్రిటిష్‌ వలసవాద కాలంలోని బానిసల జీవితానికి అద్దం పట్టే పుస్తకం ఇది. ఈ నవల కాలం 18వ శతాబ్దం. అక్క, చెల్లెళ్లు ఈ నవలలో ప్రధాన పాత్రలు. అక్క బానిస. చెల్లి ఒక బ్రిటిష్‌ గవర్నర్‌ను వివాహం చేసుకుంటుంది. పద్నాలుగు పాత్రలు కేంద్రంగా నడిచే ‘హోమ్‌గోయింగ్‌’ వందల సంవత్సరాల చారిత్రక ఘట్టాలను గుర్తు తెస్తుంది. ‘చిన్న కథలతో కూడిన పెద్ద నవల’ అని ఈ పుస్తకం గురించి చెబుతుంటారు.

అన్‌టేమ్‌డ్‌
గ్లెనన్‌ డియోల్‌ ‘అన్‌టేమ్‌డ్‌’ సండే టైమ్స్‌ నంబర్‌ వన్‌ బుక్‌ సెల్లర్‌గా నిలిచింది. స్వీయశోధన తాలూకు ప్రయాణంలో రచయిత్రి జ్ఞాపకాల సమాహారమే... అన్‌టేమ్‌డ్‌. ఈ పుస్తకానికి అక్షర బలం... స్త్రీ సాధికారత.

‘మీ మనసులో భూంకంపం పుట్టించే పుస్తకం ఇది’ అంటాడు ఒక విశ్లేషకుడు. ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడే అనంతమైన శక్తి మీలోకి వచ్చి చేరుతుంది. అలాంటి శక్తి మీలోకి రావాలంటే ఈ పుస్తకం చదవండి’ అంటాడు మరో విమర్శకుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘అన్‌టేమ్‌డ్‌’ చదవడమంటే... మన మనసుతో చేసే మౌనసంభాషణ. ‘చదవండి... సాధన చేయండి’ అనేది  ఈ పుస్తకం ఇచ్చే నినాదం.

వాయిస్‌ ఆఫ్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌
ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన స్ఫూర్తియకమైన మహిళల గురించి రాసిన పుస్తకం ‘వాయిస్‌ ఆఫ్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌’. మహిళా సాధికారత, వారి నాయకత్వ పటిమ, స్త్రీవాద భావజాలం, వ్యక్తిత్వ వికాసానికి అద్దం పట్టే పుస్తకం ఇది. ఇసాబెల్‌ అలెండే, జంగ్‌ చాంగ్, మారి కొల్విన్, కార్ల డెల్‌ పాంటే, శామి చక్రవర్తి, బేనజీర్‌ భుట్టో, స్వానీ హంట్, వంగారి మాథాయి, ట్రేసీ ఎమిన్‌... మొదలైన నలభైమంది స్ఫూర్తిదాయక మహిళల జీవితకథలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఈ నలభైమంది మహిళలలో రాజకీయ నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు, సంగీతకారులు, వ్యాపారవేత్తలు, సంఘసేవకులు... వివిధ రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement