
నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.
1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబ
తొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.
2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డి
తెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మ
జానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.
4. శారద లేఖలు– కనుపర్తి
వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.
5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలం
స్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.
6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ
స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.
7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవి
తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.
8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ
నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.
9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరా
ప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.
10. రాజకీయ కథలు– ఓల్గా
స్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.
11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మ
వారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.
12. రాయక్క మాన్యం (కథలు)–
తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.
13. నల్లపొద్దు– సంపాదకురాలు:
దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి.
14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)
తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.
15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ
కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.
16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్
భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.
17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మ
మెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.
18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది.
19. కుప్పిలి పద్మ కథలు
ఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.
20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతి
బడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి.