
ఎస్‌బీఐ మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించనుంది. 2030 నాటికి తన సిబ్బందిలో మహిళల భాగస్వామ్యాన్ని 30 శాతానికి పెంచుకునేందుకు గాను లింగ వైవిధ్యం దిశగా ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ప్రకటించారు.
‘‘కస్టమర్లకు సేవలు అందించే విభాగంలో (ఫ్రంట్‌లైన్) ఇప్పటికే మహిళల ప్రాతినిధ్యం 33 శాతంగా ఉంది. కానీ, మొత్తం సిబ్బందిలో మహిళల వాటా 27 శాతమే ఉంది. దీన్ని మరింత పెంచుకోనున్నాం. దాంతో లింగ వైవిధ్యం మరింత మెరుగుపడుతుంది’’అని చెప్పారు. ఎస్‌బీఐలో 2.4 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్యాంకులోని అన్ని స్థాయిల్లోనూ మహిళలు రాణించేలా చూసేందుకు బ్యాంకు కట్టుబడి ఉన్నట్టు కిషోర్ కుమార్ చెప్పారు. అలాగే, లక్ష్యిత కార్యక్రమాల ద్వారా నాయకత్వం, ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.