ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. SaaS స్టార్టప్‌లో సపోర్ట్ ఉద్యోగిగా వ్యక్తికి.. ఒక రోజు అతని ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సరిగా నిద్రపట్టలేదు. నిద్రలేమి వల్ల అతను అలసటగా అనిపించింది. దీంతో ఆ రోజు పని చేయలేనని భావించి.. హెచ్ఆర్ విభాగానికి ఒక సిక్ లీవ్ కోసం ఈమెయిల్ పంపాడు. ఆ ఉద్యోగి చెప్పినట్టు, ఆరు నెలల్లో ఇది అతను తీసుకున్న రెండో సెలవు మాత్రమే.

అయినప్పటికీ.. అతను ఊహించని విధంగా కంపెనీ ఫౌండర్ స్వయంగా ఆ ఈమెయిల్‌కు స్పందించారు. ఆ ఉద్యోగికి ఒకరోజు జీతం కోత పెట్టాలని HRకు సూచించారు. అదే రోజు సెలవు తీసుకోవడం కుదరదని కూడా చెప్పారు. అంతే కాకుండా.. ఫౌండర్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగి తాను అస్వస్థంగా ఉన్నానని చెప్పినా, ఫౌండర్ 'నీ వాయిస్ చూస్తే నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది' అని చెప్పారు. ఇది ఆ ఉద్యోగికి చాలా బాధ కలిగించింది.
ఇదీ చదవండి: మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు స్పందించారు. వ్యవస్థాపకులు చాలా సున్నితంగా వ్యవహరించాలి అని కొందరు చెబితే.. మరికొందరు ఆ ఉద్యోగిని వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చారు. ఈ వ్యవస్థాపకులు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏమి ఆలోచిస్తారో నాకు అర్థం కావడం లేదు. వారి ఉద్యోగులతో సరిగ్గా వ్యవహరించలేరు. వారు మనల్ని ఏమని భావిస్తారు? అని ఇంకొందరు అంటున్నారు.


