
– ‘సాక్షి’ ఫ్యామిలీతో మహిళా ఐపీఎస్‌ల మనోగతం
అణువంత ప్రోత్సాహంతో అంతులేనన్ని విజయాలు సాధిస్తామని నిరూపించారు. అపజయాలెన్ని ఎదురైనా వెరవకుండా లక్ష్యాన్ని సాధించి చూ పారు. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం.. భరోసాతో దేశంలోనే అత్యున్నత సర్వీస్‌లలో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై శభాష్ అనిపించుకున్నారు. ఓ కూతురు కండక్టర్ అయిన తన తండ్రి కల నెరవేర్చితే... మరో కూతురు తన తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో సమాజ సేవకు సిద్ధమైంది.
అమ్మ అండతో సాటి మహిళలకు భరోసాగా నిలిచే పోలీస్ అధికారి అవుతానని మరొకరు నిరూపించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 174 మందిలో 77 ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్) బ్యాచ్ ఐపీఎస్ అధికారులు నేడు నిర్వహించనున్న పాసింగ్ ఔట్‌పరేడ్‌తో (passing out parade) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్‌లోని ముగ్గురు మహిళా ఐపీఎస్‌ల మనోగతం.. వారి మాటల్లోనే...
అమ్మ ఇచ్చిన భరోసాతోనే ముందుకు వెళ్లా!
నేను ఐపీఎస్ అధికారి అయ్యానంటే అందుకు వందశాతం మా అమ్మే కారణం. నేను ఓటమి పాలైన ప్రతిసారి నాలో ధైర్యాన్ని నింపింది అమ్మ. ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రతిసారీ నాకు భరోసా ఇచ్చి నన్ను ఇక్కడివరకు నడిపింది మా అమ్మ నీతూశర్మే. నా పేరు జయశర్మ. నా స్వస్థలం హర్యానాలోని హిస్సార్. మా నాన్న ప్రమోద్ కుమార్ శర్మ. నాన్న డిస్ట్రిక్ట్ ఫుడ్ సప్లై కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాను.
నాకు ఐపీఎస్ కావాలని చిన్ననాటి నుంచే కల. అమ్మ ప్రోత్సాహం, నాన్న అండతో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టా. ఇది ఎంతో కష్టమైన పని. కొన్నిసార్లు మనపై మనం నమ్మకాన్ని కోల్పోతాం. ఇది మన వల్ల కాదనిపిస్తుంది. అలాంటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్లు, భరోసా ఇచ్చేవాళ్లు ఎంతో అవసరం. నేను కూడా మూడుసార్లు సివిల్స్‌కి ఎంపిక కాకపోయినా నిరుత్సాహ పడలేదు. తప్పులు సరిచేసుకుంటూ ముందు వెళ్లా. ఐపీఎస్ ఎలాగైనా సాధించాలన్న నా పట్టుదలకు తోడు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. నాల్గో ప్రయత్నంలో నేను అనుకున్నట్టుగానే ఐపీఎస్‌కి ఎంపికయ్యాను.
నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పూర్తిగా భిన్నమైంది. నేను ఎన్ పీఏలోకి రాకముందు కనీసం వంద మీటర్లు కూడా పరిగెత్తినట్టు గుర్తు లేదు. కానీ ఇక్కడ శిక్షణతో ఇప్పుడు ఒంటిపై బరువు, చేతిలో రైపిల్‌తో 40 కిలోమీటర్లు కూడా రన్నింగ్ చేసేంత స్థై్థర్యం వచ్చింది. మహిళా ఐపీఎస్ అధికారిగా మహిళా భద్రత, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతాను.
– జయశర్మ
నాలుగుసార్లు ఓడినా.. నాన్న ప్రోత్సాహం తగ్గలేదు
మా స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. నాన్న బస్ కండక్టర్‌గా పనిచేసి ఈ ఏడాది రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి. మా అక్క ప్రైవేటు ఉద్యోగిని. మేం ఇద్దరమూ అమ్మాయిలమే అయినా.. నాన్న మమ్మల్ని అన్నింటిలో ప్రోత్సహించేవారు. నేను అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేశాను. ప్రభుత్వ అధికారిగా ఉంటేనే సమాజానికి దగ్గరగా పనిచేయవచ్చని నాకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఇంజినీరింగ్ తర్వాత ప్రైవేటు ఉద్యోగాలవైపు వెళ్లలేదు. తమిళనాడులో స్టేట్ జీఎస్టీ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశాను. కానీ.. నన్ను ఐపీఎస్ ఆఫీసర్‌ను చేయాలన్నది నాన్న కల. అయితే సివిల్స్ కు ఎంపిక కావడం అంత సులువేం కాదు.
ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఎప్పటికప్పుడు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వ్యక్తిగతంగా నోట్స్ తయారు చేసుకుంటూ నా ప్రయత్నాన్ని కొనసాగించాను. చివరికి విజయం దక్కింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశంతో పాటు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్. ఈ శిక్షణ తర్వాత నేను ఎంతో భరోసాగా చెప్పగలను – పోలీస్ ఉద్యోగం మహిళలు కూడా ఎంతో బాగా చేయగలరని! మా బ్యాచ్‌లో కూడా 65 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండడమే అందుకు ఉదాహరణ. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి నా సలహా ఒక్కటే..సివిల్స్ సాధించడం అనేది మీ లక్ష్యం అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మధ్యలో వదలొద్దని ముందే నిర్ణయించుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడు విజయం మనదే.
– అశ్విని.ఎస్
నాకు స్ఫూర్తి మా నాన్నే
నాన్న ఎయిర్‌మెన్ గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి రిటైర్ అయ్యారు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండేది. నా చిన్నప్పటి నుంచి నాన్నను అలా యూనిఫాంలో చూస్తూ పెరగడంతో నాకు కూడా యూనిఫాం సర్వీసెస్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఆయనే నాకు ఎప్పటికీ స్ఫూర్తి. స్కూలింగ్ పూర్తయి, కాలేజీకి వచ్చాక నాకు స్పష్టత వచ్చింది ఐపీఎస్ అధికారి అయితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని. అందుకే ఎప్పటికైనా ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లా. గ్జేవియర్స్ కాలేజ్ కోల్‌కతా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయి తర్వాత నేను మొదటి ప్రయత్నంలో సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎంపికయ్యాను. 2020 లో ట్రైనింగ్ చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాను.
చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?
ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాను. అయినా, ఐపీఎస్ కలను వదల్లేదు. నాల్గో ప్రయత్నంలో నాకు ఐపీఎస్ (IPS) వచ్చింది. నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయడం.. మొదటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరగడంతో ఇక్కడి ట్రైనింగ్ కష్టంగా అనిపించలేదు. సులువుగానే శిక్షణ పూర్తి చేశా. ఇక్కడ నేర్చుకున్న విషయాలు వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగా నన్ను ఎంతో మార్చాయి. నాకు తెలంగాణ పోలీసులో మహేశ్ భగవత్ ఇన్‌స్పిరేషన్. ఐపీఎస్ అధికారిగా నేను మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను హర్యానాలో పుట్టిపెరిగాను. అక్కడి పరిస్థితులు చూశాక.. మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.
– కీర్తియాదవ్