
ఇక్కడ బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో కొందరుమారుతున్నారని వెల్లడి
రేపు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్న 174 మంది ఐపీఎస్‌లు, 16 మంది విదేశీ అధికారులు
యువ ఐపీఎస్‌లపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్‌గార్గ్ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘యువ ఐపీఎస్ అధికారులకు నేషనల్ పోలీస్ అకాడమీలో అత్యుత్తమ విలువలతో కూడిన శిక్షణ ఇస్తున్నాం. అయితే క్షేత్రస్థాయి విధుల్లోకి వెళ్లిన తర్వాత వాటిని పాటించడం అనేది వారి ఇష్టం. అయితే, అవినీతి కేసుల్లో ఉంటే ఎదురయ్యే పరిణామాలపై కూడా ఎప్పటికప్పుడు ట్రైనీ ఐపీఎస్‌లకు వివరిస్తూనే ఉన్నాం’అని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ) డైరెక్టర్ అమిత్‌గార్గ్ వ్యాఖ్యానించారు. శిక్షణ తర్వాత విధుల్లో చేరుతున్న యువ ఐపీఎస్ అధికారులపై ఇటీవల అవినీతి ఆరోపణలు పెరిగాయన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా అమిత్‌గార్గ్ ఈ మేరకు పేర్కొన్నారు.
కొందరు యువ ఐపీఎస్‌ల ప్రవర్తనపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసుకొని అకాడమీ నుంచి బయటకు వెళ్లిన కొంతమంది ఐపీఎస్‌లు విలువలు మర్చిపోతున్నారన్నారు. అయితే, శిక్షణలో భాగంగా అత్యుత్తమ విలువలు నేర్పేందుకు ప్రత్యేకంగా 11 అంశాలతో కూడిన ఒక మాడ్యుల్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 77 ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్–2024 ) బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరగనుంది.
ఈ నేపథ్యంలో బుధవారం అమిత్‌గార్గ్ మీడియాతో మాట్లాడారు. పరేడ్‌కు ముఖ్యఅతిథిగా బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ దల్జీత్‌సింగ్ చౌదరి హాజరవుతారన్నారు. 77 ఆర్‌ఆర్ బ్యాచ్‌లో మొత్తం 174 మంది ట్రైనీ ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్)లు, 16 మంది నేపాల్, రాయల్ భూటాన్, మాల్దీవ్‌లకు చెందిన విదేశీ పోలీస్ అధికారులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 65 మంది మహిళా అధికారులు ఉన్నారని చెప్పారు.
శిక్షణలో భాగంగా మొదటిదశలో 29 వారాలపాటు అకాడమీలో, ఆ తర్వాత 29 వారాలపాటు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి శిక్షణ, ఆ తర్వాత రెండో దశలో మరో 9 వారాలపాటు ఇండోర్, ఔట్‌డోర్ అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. నూతన చట్టాలపై అవగాహన, సైబర్ నేరాల నియంత్రణ, పోలీస్ ప్రవర్తన, నైతిక విలువలు, మానవహక్కులకు సంబంధించి నిపుణులతో ప్రత్యేక తరగతులు ఇప్పించామని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీపై స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చామన్నారు. సైబర్ క్రైమ్, వైట్ కాలర్ అఫెన్సెస్‌తోపాటు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు పోక్సో చట్టం, కొత్త చట్టాలు అమలుపై నిపుణులతో తరగతులు నిర్వహించామని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అటాచ్‌మెంట్‌లోనూ ట్రైనీ ఐపీఎస్‌లు సుశిక్షితులయ్యారన్నారు.
పెరిగిన మహిళా ఐపీఎస్‌ల సంఖ్య
గత బ్యాచ్‌లతో పోలిస్తే 77 ఆర్‌ఆర్ బ్యాచ్‌లో మహిళా ఐపీఎస్‌ల సంఖ్య పెరిగింది. ఈ బ్యాచ్‌లో 65 మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేశారు. 76 బ్యాచ్‌లో 54 మంది, 75వ బ్యాచ్‌లో 32 మంది, 74వ బ్యాచ్‌లో 37 మంది, 73వ బ్యాచ్‌లో 25 మంది మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేశారు.
తెలంగాణ, ఏపీ కేడర్‌కు నలుగురు చొప్పున..
ఈ బ్యాచ్ ఐపీఎస్‌లలో తెలంగాణ కేడర్‌కు ఆయోషా ఫాతిమా (మధ్యప్రదేశ్), మంధరె సోనం సునీల్ (మహారాష్ట్ర), మనీషానెహ్రా (రాజస్తాన్), రాహుల్ కంట్ (జార్ఖండ్)లను కేటాయించగా, ఏపీ కేడర్‌కు అశ్విన్ మనిదీప్ కకుమను (ఆంధ్రప్రదేశ్), జాదవ్‌రావు నిరంజన్ మహేంద్రసిన్హ్ (మహారాష్ట్ర), జయశర్మ (ఢిల్లీ), తరుణ్ (హరియాణా)లు కేటాయించారు.