ఐపీఎస్‌లు మొదలు కానిస్టేబుళ్ల వరకు వందలాది మందిపై కక్ష సాధింపు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు
సాక్షి, అమరావతి: దళిత ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. అక్రమ కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతూ వేధిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్‌కుమార్, సంజయ్, జాషువా తదితరులకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులు, అక్రమ అరెస్టులు, విచారణకు సమన్లే అందుకు తార్కాణం. ఇక వచ్చే నెల 4న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు సమన్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కుట్రను మరోసారి బహిర్గతం చేసింది.
దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమారే స్వయంగా వివక్షకు గురికావడం విస్మయ పరుస్తోంది. ఆయనకు ఏడాదిపాటు పోస్టింగు ఇవ్వలేదు. అనంతరం ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయడంతోపాటు సస్పెండ్ చేసి, వేధింపులను తీవ్రతరం చేసింది. ఆరు నెలలుగా ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు. పీవీ సునీల్‌కుమార్.. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకుని మరీ వ్యక్తిగత పనుల మీద చేసిన విదేశీ పర్యటనలను కూడా వక్రీకరించి అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం.
ఇక సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి కాస్త ఖరీదైన వాచీ ధరించడాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి వత్తాసు పలికే ఎల్లో మీడియా భరించలేక పోవడం విభ్రాంతి పరిచింది. ఆయన వాచీ మీద కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారానికి పాల్పడింది. గతంలో ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై చేసిన ఆరోపణలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతుండటం గమనార్హం. ఆ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
⇒ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబు ప్రభుత్వ బాధితుడిగా మారారు. ఆయన కేవలం మూడు నెలలపాటు అగ్ని మాపక శాఖ ఇన్‌చార్‌్జగా అదనపు డీజీగా వ్యవహరించారు. అగ్ని మాపక శాఖ పరికరాల కొనుగోలు, బిల్లుల చెల్లింపుతో ఆయనకు నేరుగా ప్రమేయం లేదు. కానీ సంజయ్‌పై అక్రమ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసింది. అనంతరం ఏకంగా అరెస్టు చేసి జైలు పాలు చేసింది. ఇప్పటికీ అక్రమ కేసులో ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి జాషువాకు కూడా పోస్టింగు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది.
⇒ దళిత అధికారి విశాల్ గున్నీని అక్రమ కేసులో సస్పెండ్ చేసింది.
⇒ రిటైర్డ్ దళిత పోలీసు అధికారి విజయ్ పాల్‌పై అక్రమ కేసు నమోదు చేసింది. రాజకీయ కక్ష సాధింపుతో ఆయన్ను అరెస్టు చేసి జైలు పాలు చేసింది.
⇒ ఇలా ఐపీఎస్‌లు డీఎస్పీ నుంచి ఎస్సై వరకు ఎంతో మంది దళిత పోలీసు అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది.
ఏపీలో దళిత ఐపీఎస్ అధికారులకు వేధింపులు
దళిత ఐపీఎస్ అధికారులపై వివక్ష, వేధింపులు హరియాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో మరింత తీవ్రంగా సాగుతున్నాయి. కుల వివక్షకు గురైన హరియాణలో పూరన్ కుమార్ అనే దళిత ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ, అంతకంటే తీవ్ర స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఏపీలో దళిత ఐపీఎస్ అధికారుల పట్ల వివక్షను ప్రదర్శించడమే కాకుండా, వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సంజయ్‌లపై నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు నిదర్శనం. అక్రమ కేసులు బనాయించి ఐపీఎస్ సంజయ్‌ని జైల్లో పెట్టారు. దళిత, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే పీవీ సునీల్ కుమార్‌ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోంది. ఈ వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నా.
– ‘ఎక్స్’లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్


