సాక్షి, అనంతపురం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సూటిగా స్పందించకపోవడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది వ్యాఖ్యలు చేశారు.
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లుగా టీడీపీ, కూటమి నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది. రాయలసీమ కు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు.
అలాగే, లిఫ్ట్ కాదు తెఫ్ట్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు. తాను చేసినట్టే అందరూ అవినీతి చేస్తారని పయ్యావుల కేశవ్ భావిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగి ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు ఎందుకు మంజూరు చేశారు?. రాయలసీమ లిఫ్ట్‌ను ప్రాజెక్టే కాదని మంత్రి కేశవ్ ఎలా అంటారు?. ప్రాజెక్టు కాదన్నవారు రూ.190 కోట్లు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి దాకా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. చంద్రబాబుకు సీమ ప్రయోజనాల కన్నా.. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు.


