ధరలు పడిపోయి రైతు గగ్గోలు
నాణ్యతను బట్టి కిలో రూ.15 నుంచి రూ.20
కోత ఖర్చులు రాని పరిస్థితి
తూర్పుగోదావరి జిల్లాలో 3,200 హెక్టార్లలో సాగు
పెరవలి: నిమ్మ మార్కెట్ కుదేలై రైతులు విలవిలలాడుతున్నారు. మార్కెట్‌లో కాయల నాణ్యతను బట్టి కిలో రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోయకుండా తోటల్లోనే వదలివేస్తున్నారు. గతంలో ధరలు లభించిన సమయంలో తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యారు. ఇప్పుడు దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. ఒక బస్తా నిమ్మకాయలు (50 కిలోలు) మార్కెట్‌లో కాయ సైజుని బట్టి ప్రస్తుతం రూ.800 నుంచి రూ.1000కు కొనుగోలు చేయడంతో కోత, రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని దీనంగా చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో బస్తా నిమ్మకాయలు రూ.1800 నుంచి రూ.2100కు కొనుగోలు చేశారు.
వ్యాపారులు నేడు మార్కెట్‌లో వీటి వంక చూసేవారు లేరని రైతులు దిగులు చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పతనమయ్యాయని చెపుతున్నారు. కోత కోయాలంటే ఇద్దరు కూలీలు అవసరం ఉంటోందని, వీరికే రూ.వెయ్యి అవుతున్నదని ఇక రవాణా ఖర్చులు, మార్కెట్‌లో కమీషన్ తీసేస్తే చేతికి ఏమీ రావడం లేదని వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.60 నుంచి రూ.80 పలికేది. ఒక బస్తా నిమ్మకాయలకు నాణ్యతను బట్టి రూ.2500 నుంచి రూ.4000 వచ్చేదని ఇప్పడు కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని, ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటం లేదని వాపోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలో 3200 హెక్టార్లలో సాగవుతోంది. పెరవలి, దేవరపల్లి, చాగల్లు, నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి, రాజానగరం, సీతానగరం, అనపర్తి మండలాల్లో సాగవుతోంది. పెరవలి మండలంలో నిమ్మసాగు ఖండవల్లి, లంకమాలపల్లి, ముత్యాలవారిపాలెం, ఉమ్మిడివారిపాలెం, ఓదూరివారిపాలెం, ముక్కామల గ్రామాల్లో 50 ఎకరాల్లో సాగవుతుండగా ఈ రైతులందరూ నష్టాలకు గురవుతున్నారు. ఒక ఎకరం నిమ్మ పంటలో ఏడాదికి దిగుబడి 5 నుంచి 6 టన్నులు వస్తుంది.
సాగుపై ఆధారపడి.. తూర్పుగోదావరి జిల్లాలో నిమ్మసాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మంది రైతులు, వ్యాపారులు, కూలీలు, రవాణా దారులు ఈ సాగుపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు లేకపోవటంతో ఇటు కూలీలకు, వ్యాపారులకు, సంచులు సరఫరా చేసే వ్యాపారులకు, కోత కూలీలకు, జట్టు కూలీలకు పనులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ధరలిలా.. నిమ్మకాయలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బస్తా ధర రూ.1800 నుంచి రూ.2100 పలికితే నేడు అదే నిమ్మకాయలు రూ.800 నుంచి రూ.వెయ్యి పలకడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుపోతున్నారు. అది కూడా కాయలు బాగుంటే ఈ ధర వస్తున్నదని లేకపోతే మరో రెండు వందలు తక్కువకు అడుగుతున్న పరిస్థితి. పెట్టుబడి తప్పటం లేదు ఒక ఎకరం నిమ్మ సాగుకు ఏడాదికి రూ.25 నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ప్రస్తుత ధరల వల్ల నిమ్మకాయలకు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సీజన్‌లో తెగుళ్ల బెడద, దిగుబడి వచ్చే సమయంలో ధరల సమస్య నిమ్మరైతులను కుంగదీస్తోంది. మరోవైపు ఈ నిమ్మను వాడటానికి సీజన్ కాకపోవడం, శుభకార్యాలు లేకపోవడంతో వీటి వినియోగం బాగా తగ్గిందని అందుకే నిమ్మధరలు పతనమయ్యాయని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్‌లో అన్ని రకాల పండ్లు తక్కువ ధరలకే లభించడం, వీటి ఉపయోగం అంతంతమాత్రంగా ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు.
ఇంత పతనం ఎన్నడూ లేదు
గతంలో ఎన్నడూ ఇంతటి తక్కువ ధరలు పలకలేదు. నేడు మార్కెట్లో కిలో నిమ్మకాయలు నాణ్యతను బట్టి రూ.15 నుంచి రూ.20కు కొనుగోలు చేస్తున్నారు. దీనితో కోత ఖర్చులు కూడా రావటం లేదు. నష్టాల పాలవుతున్నాం. – చిట్టీడి సూరిబాబు, నిమ్మరైతు, ముత్యాలవారిపాలెం
అదనపు ఖర్చులవుతున్నాయి
సీజన్ లేకపోయినా ధరలు బాగానే ఉండేవి. నేడు కోత ఖర్చులు రావటం లేదు. అదనంగా రవాణా, సంచుల ఖర్చులు అవుతున్నాయి. కోయకుండా వదిలేస్తే చెట్లు దెబ్బతింటాయి. కోస్తే జేబులో సొమ్ము అదనంగా ఇవ్వాల్సి వస్తోంది. – వలవల బాలాజీ, రైతు ముక్కామల
గత ప్రభుత్వంలో రూ.4 వేలు
నిమ్మసాగు చేపట్టి పదేళ్లు అయ్యింది. ఇంతటి తక్కువ ధరలు ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో 50 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.2500 నుంచి రూ.4 వేలకు కొనుగోలు చేశారు. అదే బస్తా నేడు రూ.800 నుంచి రూ.వెయ్యి పలుకుతోంది. – నిడదవోలు శ్రీనివాస్, రైతు ముక్కామల


