
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే
నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..
నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...
రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.
నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...
‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.
దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!
నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.
నన్ను టెర్రరిస్ట్ అన్నారు!
నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్‌గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్‌లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.
మాటలు మాత్రమే చాలవు
రాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు.
భయం చుట్టుముట్టిన సమయం
ఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.
అమ్మ మాట
‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు.