ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి విఘాతం
నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జరుగుతున్న తీరుపై నోబెల్ గహ్రీత అమర్త్య సేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అనవసరపు హడావుడితో సర్‌ను అమలు చేస్తున్నారన్నారు. దీని కారణంగా ప్రజల భాగస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న ఆయన ఇటీవల పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు.
‘ఓటు హక్కును బలోపేతం చేసే ఓటరు జాబితా ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైంది. ఓటరు జాబితా రివిజన్ ప్రక్రియ కూడా అంతే ముఖ్యమైంది. దీన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలి. అవసరమైన సమయం కేటాయించాలి. అయితే, ఇవన్నీ బెంగాల్‌లో ప్రస్తుతం లోపించాయి’అని సేన్ పేర్కొన్నారు. ‘ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత వేగంగా, హడావుడిగా జరుగుతోంది. ఓటర్లు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమరి్పంచేందుకు తగినంత సమయం ఇవ్వడం లేదు. ఇది ఓటర్లకు అన్యాయం, దేశ ప్రజాస్వామ్యానికి ద్రోహం’అని అమర్త్య సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అధికారులపైనా తీవ్ర ఒత్తిడి
ఓటర్లే కాదు, ఎన్నికల అధికారులు కూడా సర్ విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తనకు అర్థమైందన్నారు. తన నివాసమున్న శాంతినికేతన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల అధికారులు ఫోన్ చేసి, వాకబు చేసిన అంశాలను ఆయన ఉదహరించారు. ‘ఎన్నికల అధికారులు చనిపోయిన మా అమ్మ గురించి అడిగారు. నేను పుట్టినప్పుడు మా అమ్మ వయస్సెంత ఉంటుందంటూ ఆరా తీశారు. గత ఎన్నికల సమయంలో అక్కడే ఓటేశా. అప్పట్లో రికార్డులన్నీ అధికారుల వద్ద ఉన్నాయి. అందులో నా చిరునామా, మా కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలు సహా అన్ని వివరాలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయాలను అడగడం బట్టి చూస్తే వారెంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతుంది’అని ఆయన అన్నారు. తన మాదిరిగానే అనేక మంది గ్రామీణ భారతీయులు ఇలాంటి విచారణలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శాంతినికేతన్ ఉన్న ఊళ్లో పుట్టిన తనకు బర్త్ సరి్టఫికెట్ లేకపోవడంతో ఓటరుగా అర్హత సాధించేందుకు స్నేహితులు తన తరఫున అవసరమైన పత్రాలను అందజేశారన్నారు. తన విషయం పరిష్కారమైనప్పుటికీ, ఎటువంటి సాయం అందని సామాన్యులు పడే అవస్థలపై అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. సేన్, ఆయన తల్లి వయస్సుల్లో తేడాలపై సర్ అధికారులు ఆయనకు నోటీసు పంపడం తెల్సిందే.
బీజేపీకే లాభమని అంటున్నారు
బెంగాల్‌లో చేపట్టిన సర్‌తో ఎవరికి లాభం చేకూరుతుందనే విషయంలో తనకు సొంతంగా ఎటువంటి అంచనాలు లేవని అమర్త్య సేన్ తెలిపారు. ‘నేనేమీ ఎన్నికల విశ్లేషకుడిని కాను. ఈ విషయం కచి్చతంగా చెప్పలేను. నా కంటే ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తులు చెప్పినదేమంటే.. సర్‌తో తక్కువ మంది ఓటర్లు నమోదవడం వల్ల బీజేపీకే ప్రయోజనమని. ఇది నిజమే కాదో నాకు తెలియదు’అని ఆయన అన్నారు. ‘అయితే, ఈసీకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరు లబ్ధి పొందుతారు అనే విషయంతో సంబంధం లేకుండా, ఎన్నికల సంఘం ఈ లోపభూయిష్టమైన ఏర్పాటును కొనసాగనీయరాదు. గరి్వంచదగ్గ మన ప్రజాస్వామ్యంలో అనవసరమైన తప్పిదాలు జరిగేలా బలవంతం చేయరాదు’అని ఆయన హితవు పలికారు.
నిరుపేదలపైనే ఎక్కువ ప్రభావం
సర్ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి నిరుపేదలే ఎక్కువగా తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని అమర్త్య సేన్ చెప్పారు. అధికారులు అడిగే ధ్రువీకరణ పత్రాలను సామాన్యులు తీసుకురావడం కష్టసాధ్యమైన విషయంగా మారడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్ల జాబితాలో చేరడానికి అవసరమైన కొన్ని నిర్దిష్ట పత్రాలను సేకరించి, చూపించాలనే నిబంధన నిరుపేదలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రస్తుత సామాజిక వాతావరణంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాలు కూడా తమ ఓటు హక్కుతో సహా ఇతర హక్కులను పరిరక్షించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బలపడిన హిందుత్వ అతివాదుల వల్ల ముస్లింలతోపాటు, కొన్ని వర్గాల హిందువులు కూడా కొన్నిసార్లు వెనుకబాటుకు గురవుతున్నారని సేన్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు అందేలా ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.


