
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...
సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు.
మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.
బాల్యం నుంచీ...
మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్‌లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.
సత్యభామ.. మీరజాలగలరా..!
కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.
సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!
ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్‌లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది.
కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు.
సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.
– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి