బెంగుళూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి శ్రీ కృష్ణ భక్తుడు. ప్రతి ఏడాదీ ఇతర భక్తులతో కలిసి క్రమం తప్పకుండా మథుర వెళ్ళివస్తూ ఉంటాడు. ‘ఎప్పుడూ మనం వెళ్ళి రావడమేనా, ఒక పేద వాడైన కృష్ణ భక్తుడికి ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా’ అని అతడి భార్య సూచించింది. అనుకున్నదే తడవుగా తమ బృందనాయకుడితో ఆ విషయం చెప్పాడు. బృంద నాయకుడు అతడి ఆలోచనకు హర్షం వెలిబుచ్చాడు. అయితే తాను ప్రయాణ ఖర్చులతో పాటు అన్ని ఖర్చులూ భరిస్తున్నట్లు ఎక్కడా బహిరంగపరచవద్దని కోరు కున్నాడు వ్యాపారి.
అలాగే ఆ ఏడాది హరేకృష్ణ బృందం విమానంలో బయలుదేరింది. దేశ రాజధాని దిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మథుర చేరుకుంది. యమునా నదీతీరంలో శ్రీ కృష్ణ జన్మ స్థానమైన కారాగారాన్ని చూస్తూ ఒక బృంద సభ్యుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఉండబట్టలేని బంగారు వ్యాపారి కారణమేమిటని ప్రశ్నించాడు. ‘‘నేను చిన్న కూలీని. నా ఆదాయం అంతంత మాత్రమే. శ్రీ కృష్ణుడి భక్తుడినైనా ఇంతింత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చేంత స్తోమత నాకు లేదు. ఈ జన్మలో మథుర వస్తానని అనుకోలేదు. శ్రీ కృష్ణ జన్మస్థానం కళ్ళారా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఏ మహానుభావుడికో ఒక ఆలోచన వచ్చి నాకు ఈ ప్రయాణ అవకాశం కల్పించాడు. అతడి ఋణం ఎలా తీర్చుకోగలను? అతడికి కృతజ్ఞతలు తెలుపుదామంటే కూడా వీలుపడటం లేదు. ఎందుకంటే అతడు గుప్తదానం చేశాడు’’ అని విలపించాడు.
బంగారు వ్యాపారి మనసు చలించింది. అయినా తానే ఆ గుప్తదాత అని చెప్పుకోదలచలేదు. గమ్మున ఉండిపోయాడు. ఆ బృందం అలాగే నైమిశారణ్యం, అయోధ్యలు చూసి విమానం ఎక్కారు. యాత్ర విజయవంతం అయినందులకు బృంద నాయకుడు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. విమానం బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు తెలుపుకున్నారు. లగేజీ అందించే సమయం వచ్చింది. లగేజీలు అందుకునే సమయంలో బంగారు వ్యాపారి సంచికన్నా కూలీ సంచి ముందు వచ్చింది. ఆనందంతో అతడు సంచి ఎత్తుకుంటూ ఉంటే సంచిపై అతడి పేరు చూశాడు వ్యాపారి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.‘శ్రీ కృష్ణలీలలు ఇంతింత కాదయా’ అనుకున్నాడు. ఎందుకంటే ఆ కూలీ పేరు కుచేలన్!
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు


