బెంగళూరు నగరంలో ఒకవైపు ఇండిగో విమానాలరద్దు ఆందోళన కొనసాగుతుండగానే మరో గందరగోళం వెలుగులోకివచ్చింది. ఏ వంటకమైనా రూ. 30 అన్న ఆఫర్, విపరీతమైన ట్రాఫిక్‌తో పోలీసులకు తలనొప్పిగా మారింది.
బెంగళూరులోని హెబ్బల్‌లోని ఒక ప్రముఖ పబ్ తన మూడవ వార్షికోత్సవాన్ని సందర్భంగా'రూ. 30 కి ఏదైనా వంటకం' అనే ఆఫర్‌ను ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది దీంతో కస్టమర్లు ఆ పబ్‌కు క్యూ కట్టారు. దాదాపు 300 మంది సీటింగ్ సామర్థ్యంతో, ఆ స్థలంలో దాదాపు 1,000 మంది తరలి వచ్చారు. దీంతో జనాన్ని నియంత్రించ లేక సిబ్బంది నానా బాధలు పడ్డారు.
అటు ఫుడ్ కోసం పడిగాపులు జనం పబ్ వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళనకు దిగడం, విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో పరిస్థితిని నియంత్రించలేక, సాయంత్రం 4 గంటలకు ముందే అవుట్‌లెట్‌ను మూసివేసింది. సరిగ్గా ప్లాన్ లేకపోవడంతో, జనాన్ని అదుపు చేయలేకపోవడంతో వేచి ఉన్న కస్టమర్లలో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. మరోవైపు ఈ రద్దీ కారణంగాఎస్టీమ్ మాల్ రోడ్,హెబ్బల్ ఫ్లైఓవర్‌తో సహా ప్రక్కనే ఉన్న రోడ్లపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.
దీనిపై కస్టమర్లు ఏమన్నారంటే..
ఆఫర్‌కి సంబంధించి టైం ఏమీ చెప్పలేదు. కాబట్టి మేము డిన్నర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుని సాయంత్రం 6.30 గంటలకు బసవేశ్వరనగర్ నుండి బయలుదేరాం. కానీ భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఎస్టీమ్ మాల్ దగ్గరికి వెళ్లేసరికి పబ్ మూసేశారని తెలిపింది. పిల్లలు తాము ఆకలితో, బాధతో వెనక్కి వచ్చామని వాపోయింది ఏడుగురు కుటుంబ సభ్యులతో పబ్‌కు వచ్చిన 35 ఏళ్ల మహిళ.
ఉదయం 11.30 గంటలకు పబ్‌కు చేరుకున్నాం అప్పటికే రెండు క్యూలు కనిపించాయి. మొదటి బ్యాచ్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు మాత్రమే లోపలికి అనుమతించారు, ఆ తర్వాత మమ్మల్ని లోపలి క్యూలోకి పంపారు. బ్యాచ్ బ్యాచ్‌లుగా జనం వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1 కల్లా ఆఫర్‌ముగిసిందన్నారు. నిరసనల తర్వాత, 10 మందిని బ్యాచ్‌లుగా అనుమతినిచ్చారు. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు మాకు టేబుల్ దొరికింది. చాలా భయంకరం అని మరొకరు చెప్పారు.
సిబ్బంది ఏమన్నారంటే
వాస్తవానికి, ఆఫర్‌ను రోజంతా అమలు చేయాలనుకున్నాం. కానీ 1,000 పైగా జనం రావడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది చెప్పారు. ఇంత స్పందన ఊహించలేదని, భద్రతా కారణాల వల్ల పబ్‌ను ముందుగానే మూసివేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు జనం వెళ్లిపోయేంతవరకు షట్టర్లను మూసివేయమని తామే పబ్ యాజమాన్యానికి చెప్పి, జనాన్ని చెదరగొట్టామని పోలీసు అధికారి తెలిపారు.


