భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్థంతి నేడు(డిసెంబర్ 6). 1956లో ఇదే రోజున ఆ మహనీయుడు కన్నుమూసినప్పటికీ, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చే ‘జై భీమ్’ నినాదం నేటికీ ఆయన వారసత్వాన్ని, దళితుల ఐక్యతను చాటుతోంది. డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్‌పై గల అపారమైన గౌరవాన్ని, దళిత సమాజపు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన నినాదం ‘జై భీమ్’ ఆవిర్భావం వెనుక ఆసక్తికర కథనం ఉంది.
సుమారు 87 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని నాటి ఔరంగాబాద్ (నేటి ఛత్రపతి శంభాజీనగర్) జిల్లా, కన్నద్ తెహ్సిల్‌లోని మక్రాన్‌పూర్ గ్రామంలో చారిత్రక తొలి పరిషత్ సమావేశం జరిగింది. మరాఠ్వాడ షెడ్యూల్డ్ కులాల సమాఖ్య మొదటి అధ్యక్షుడు భౌసాహెబ్ మోర్, డిసెంబర్ 30, 1938న ఈ మొదటి మక్రాన్‌పూర్ పరిషత్‌ను నిర్వహించారు. ఈ చారిత్రక సందర్భాన్ని గురించి భౌసాహెబ్ మోర్ కుమారుడు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ మోర్ వివరించారు. నాటి సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ పాల్గొని, ఆనాటి హైదరాబాద్ రాచరికపు రాష్ట్రానికి మద్దతు ఇవ్వవద్దని ప్రజలను కోరారు.
అనంతరం భౌసాహెబ్ మోర్ మాట్లాడుతూ ప్రతి సమాజానికి ఒక ఆరాధ్య దైవం ఉంటాడని, ఆ పేరుతో వారు పలకరించుకుంటారని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ మనకు పురోగతి మార్గాన్ని చూపించారని, ఆయన మనకు దేవుడిలాంటివారని, కాబట్టి ఇక నుండి మనం ఒకరినొకరు కలిసేటప్పుడు ‘జై భీమ్’ అని పలుకరించుకోవాలని పిలుపునిచ్చారు. పరిషత్‌కు హాజరైన జనం ఈ కొత్త నినాదంపై ఉత్సాహంగా స్పందించి, వెంటనే ఆ నినాదాన్ని తమ సమాజ నినాదంగా అంగీకరిస్తూ, ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
మక్రాన్‌పూర్ వేదిక ఎంపిక వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. నాటి నిజాం పాలకులు దళితులపై మతమార్పిడి ఒత్తిళ్లతో సహా పలు దురాగతాలకు పాల్పడేవారు. వీటిని భౌసాహెబ్ మోర్.. డాక్టర్ అంబేద్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే రాచరిక రాష్ట్రాలను వ్యతిరేకించిన కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాలు ఇవ్వకుండా నిషేధించారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ భూభాగంలో ఉన్న మక్రాన్‌పూర్ గ్రామాన్ని సమావేశ వేదికగా ఎంచుకున్నారు. అంబేద్కర్ అనుచరులు నిజాం పోలీసుల నుండి తప్పించుకుని ఈ సభకు హాజరయ్యారు.
మొదటి మక్రాన్‌పూర్ పరిషత్ కోసం భౌసాహెబ్ మోర్ కుటుంబం ఎంతో త్యాగం చేసింది. ఖర్చుల నిర్వహణ కోసం మోర్ తన అమ్మమ్మ నగలను తాకట్టు పెట్టారు. ఖాందేశ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 30న నిర్వహిస్తారు. 1972లో మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం కొనసాగడం విశేషం.
ఇది కూడా చదవండి: అయోధ్యలో హై అలర్ట్.. మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు..


