నిర్జీవ ప్రేమికుడిని పెళ్లాడిన యువతి తాజా ఆరోపణ
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే.
సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్‌ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. సక్షమ్‌పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్‌ను హత్య కు పురిగొల్పారు.
వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్‌ను చంపేసెయ్ అని హిమేశ్‌ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్‌ను చంపేశాక పోలీస్‌స్టేషన్‌కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్‌ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్‌ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి.
హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.


