
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్‌కి మోస్ట్‌వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..
గాయనిగా మైథిలీ ఠాకుర్ దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు.
జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్‌ను చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి.
ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి.
ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్‌నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభి్రపాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరి పోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే!