మేం చేస్తాం ఇవ్వండి

library in us - Sakshi

ఓర్పు, నేర్పు మహిళలకే అధికం. మగవాళ్లది భుజ బలం అనుకుంటే, మగువలది మనోబలం. కొత్త పని, కష్టమైన పని చేయడానికి మగువ ముందొక దారి వేస్తే, ఆ తర్వాత పురుషుడు ఆ దారిలో పయనించిన  సందర్భాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి. 1930లలో యు.ఎస్‌.లో మారుమూల కొండప్రాంతాల వారికి పుస్తకాలు అందుబాటులో ఉండేవి కాదు. పుస్తకం ఉన్న ఇల్లంటే గొప్ప. స్కూళ్లలో కూడా అంతే. గ్రంథాలయం ఉంటే అది గొప్ప స్కూలు.

ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు... ఈ కొండ ప్రాంతాల వారికి పుస్తకాలు సరఫరా చెయ్యడం ఎలా అని చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసి, ఆలోచనలు జరిపారు. మొబైల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంతా అన్నారు కానీ.. ఆ కొండల్లోకి, గుట్టల్లోకి, మంచు ప్రదేశాల్లోకి వాహనాలు వెళ్లలేవు. ‘సరే అయితే, గుర్రాలపై పంపిద్దాం’ అన్నారు రూజ్‌వెల్ట్‌! చదువుకునే వాళ్ల సంఖ్య తగ్గితే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆందోళన. గుర్రాలైతే సిద్ధంగా ఉన్నాయి.

పుస్తకాలూ సిద్ధంగా ఉన్నాయి. మరి గుర్రాలను స్వారీ చేసేవారెవరు? పుస్తకాలను రవాణా చేసేవారెవరు? మొదటైతే మగవాళ్లెవరూ ముందుకు రాలేదు. మగువలే ఉత్సాహంగా వచ్చి ‘మేం చేస్తాం’ అన్నారు! ప్రెసిడెంట్‌కి సంతోషం వేసింది. గుర్రాలపై స్వారీ చేస్తూ పుస్తకాలు మోసుకెళ్లడం. పాఠశాలలకు ఇవ్వడం. ఇళ్లకు మామూలు పుస్తకాలను చేరవేయడం, వాళ్లు చదివిన పుస్తకాలను తిరిగి తీసుకోవడం, ఎవరైనా పెద్దవాళ్లు చదివి వినిపించ మని కోరితే వారితో కొద్దిసేపు కూర్చొని పుస్తక పఠనం చేయడం.. ఈ బాధ్యతలనన్నింటినీ మహిళలు చక్కగా నిర్వర్తించారు.

‘బుక్‌ ఉమెన్‌’ అని వాళ్లకు పేరు. కొండపైన ఉండే కాలనీల్లోకి బుక్‌ ఉమెన్‌ వస్తున్నారంటే పండుగ వచ్చినట్లే ఉండేది. 1943 వరకు ఈ గుర్రపు గ్రంథాలయాలు నిరాటంకంగా నడిచాయి. నడవడం కాదు, మహిళలు నడిపించారు. ఆ తర్వాత నిధుల్లేక ఆగిపోయాయి. మహిళలకు అప్పగించిన పని ఏదైనా నిధుల్లేక ఆగిపోవల్సిందే కానీ, నిబద్ధత లేక ఆగిపోయింది ఒక్కటీ కనిపించదు. చరిత్రను తిరగేసి చూడండి. వర్తమానాన్నీ తరచి చూడండి. ఎక్కడా కనిపించదు.

దేశాలను ప్రభుత్వాలు నడుపుతాయి. ప్రభుత్వాలను పథకాలు నడుపుతాయి. పథకాలు మహిళలు నడిపితేనే ఫలవంతం అవుతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top