కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు
జన్యు శాస్త్ర చరిత్రలోనే మైలురాయి
మహిళల్లో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్ స్విచ్ (జన్యు మీట)ను మన సైంటిస్టులు కనిపెట్టారు! పిండం గర్భాశయ ద్వారంలోకి సజావుగా చేరేందుకు వీలు కల్పించేది ఇదేనట! కనుక ఏ కోణంలో చూసినా దీన్ని జన్యు శాస్త్రంలోనే గాక ప్రసూతి వైద్యంలోనూ అతి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. జన్యు శాస్త్ర ప్రస్థానాన్నే పునర్ నిర్వచించగలదని భావిస్తున్న ఈ కీలక పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ ప్రత్యుత్పత్తి, శిశు వైద్య పరిశోధన సంస్థ (ఎన్‌ఐఆర్‌ఆర్ సీహెచ్), ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు సారథ్యం వహించడం విశేషం.
పిండాన్ని తనలోకి స్వీకరించేందుకు గర్భాశయం సన్నద్ధం కావడం వెనక ఇమిడి ఉండే కీలకమైన కణజాల పనితీరును మన సైంటిస్టులు ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చారు. గర్భధారణ జరగాలంటే బుల్లి పిండం గర్భ సంచి మార్గంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని ఇంప్లాంటేషన్ గా పిలుస్తారు. గర్భధారణ దిశగా ఇది తొలి అడుగు మాత్రమే కాదు, ఒకరకంగా పునరుత్పత్తి ప్రక్రియ అంతటిలోనూ ఇదే అత్యంత కీలకం. గర్భ విచ్ఛిత్తికే గాక, చివరికి వంధ్యత్వానికి కూడా ఇంప్లాంటేషన్ లో వైఫల్యమే మూల కారణం!
ఇలా చేశారు...
హోక్సా10, ట్విస్ట్2 అనే రెండు కీలక జన్యువులను సైంటిస్టులు తమ పరిశోధన క్రమంలో గుర్తించారు. గర్భధారణ విషయంలో ఇవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులుగా పని చేస్తూనే, అంతిమంగా అందుకు వీలు కల్పించడం విశేషం! ఎందుకంటే హోక్సా10 సాధారణంగా గర్భాశయ ద్వారాన్ని రక్షణాత్మక కణజాలాల సాయంతో నిత్యం మూసి ఉంచి కాపాడుతూ ఉంటుంది. ఇందుకోసం అది అనునిత్యం ఏకంగా 1,200 కణాలను నియంత్రిస్తూ ఉంటుంది. కానీ, సరిగ్గా పిండం ఆ ద్వారం వైపు వచ్చే వేళకు హోక్సా10 తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మరోలా చెప్పాలంటే దాని పనితీరు స్తంభిస్తుందన్నమాట.
మరుక్షణమే ట్విస్ట్2 ఒళ్లు విరుచుకుని క్రియాశీలకం అవుతుంది. గర్భాశయ కణజాలాన్ని మృదువుగా మార్చి పిండం దాని ద్వారం గుండా సజావుగా లోనికి సాగేలా చేస్తుంది. హోక్సా10, ట్విస్ట్2 నడుమ సంబంధం వల్ల గర్భాశయ ద్వారం గట్టిదనం నుంచి మృదుత్వాన్ని, అవసరం తీరగానే తిరిగి యథాస్థితికి మారుతున్నట్టు ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం రూపొందించిన మ్యాథమాటికల్ రీ మోడలింగ్ లో తేలింది. అనంతరం ఎలుకల్లో ప్రయోగాత్మకంగా ట్విస్ట్2 కార్యకలాపాన్ని నిరోధించి చూడగా గర్భధారణ ప్రక్రియే నిలిచిపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు కాల్ డెత్ డిస్కవరీ జర్నల్ లో తాజాగా ప్రచురితమయ్యాయి.
ప్రయోజనాలు ఎన్నెన్నో!
ఈ జెనెటిక్ స్విచ్ ఉనికి వెలుగులోకి రావడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ జన్యువులు, వాటి స్వరూప స్వభావాలు, పనితీరు తదితరాల గురించి మనకు ఇప్పటిదాకా తెలిసింది గోరంత అయితే తెలియాల్సిందేమో కొండంత. కీలకమైన జన్యు నెట్ వర్క్ తదితరాలపై మరింత అవగాహనకు జెనెటిక్ స్విచ్ వీలు కల్పించగలదు. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్సతో పాటు తీవ్ర గాయాలను త్వరితంగా నయం చేయడం వంటివీ వీలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి‘ అని వారు వివరించారు. ‘కొన్నిసార్లు ఆరోగ్యకరమైన పిండం కూడా ఫలదీకరణ చెందడంలో విఫలమవుతుంటుంది. అందుకు కారణాలను అన్వేషించడంలో జెనెటిక్ స్విచ్ వ్యవస్థ ఉనికి ఎంతగానో తోడ్పడుతుంది. ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ చికిత్స ప్రక్రియలు మరింతగా విజయవంతం అయ్యేలా చేయగలదు‘ అని చెప్పుకొచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


