టోక్యో: జపాన్ పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుతం దిగువ సభలో 73 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కానీ వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ వద్ద కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిపై మహిళా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 60 మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కొత్త ప్రధాని సేన్ తకైచి కూడా దీనిపై కలత చెందినట్లు సమాచారం.
జపాన్ పార్లమెంట్ భవనం 1936లో నిర్మించబడింది. ఆ సమయంలో దేశంలో మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత 1945 డిసెంబర్‌లో మహిళలకు ఓటు హక్కు లభించింది. అనంతరం 1946 ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే కాలం మారినా భవనంలోని మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా మారలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జపాన్ ప్రముఖ వార్తాపత్రిక యోమియురి షింబున్ నివేదిక ప్రకారం... పురుషుల కోసం పార్లమెంటులో 12 మరుగుదొడ్లు (మొత్తం 67 స్టాల్స్) ఉన్నాయి. మహిళల కోసం 9 మరుగుదొడ్లు (మొత్తం 22 క్యూబికల్స్) మాత్రమే ఉన్నాయి. కాగా ప్రధాన విచారణలు జరిగే ప్లీనరీ హాల్ వద్ద మాత్రం మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉంది. దాంతో సమావేశాలకు ముందు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు మహిళా ఎంపీలు భవనంలోని మరో భాగానికి వెళ్లి టాయిలెట్ వినియోగించుకోవాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ మహిళా ఎంపీ యసుకో కొమియామా స్పందిస్తూ.. పార్లమెంటు సమావేశాల సమయంలో మహిళా సభ్యులు టాయిలెట్ బయట క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా అవమానకరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో 148 దేశాల్లో జపాన్ 118వ స్థానంలో నిలిచింది. వ్యాపారం, మీడియా, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఎన్నికల సమయంలో మహిళా అభ్యర్థులు తరచూ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారని, రాజకీయాలకంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటులో మహిళల సంఖ్య పెరుగుతోంది
ప్రస్తుతం: దిగువ సభలో 465 మంది ఎంపీలలో 72 మంది మహిళలు, ఎగువ సభలో 248 మందిలో 74 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు కనీసం 30 శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ పరిణామాల నడుమ, కొత్త ప్రధాని సేన్ తకైచి నిర్వహించిన సమావేశం తర్వాత దేశంలో పని, జీవిత సమతుల్యతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో ఆమె పని, పని, పని మాత్రమే అనే వైఖరితో వార్తల్లో నిలిచారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని, పని, జీవిత సమతుల్యతను నమ్మనని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.
మొత్తంగా జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు మౌలిక సౌకర్యాల కోసం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉందన్న విషయం ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది.


