బుక్ షెల్ఫ్
ఉత్తరాన కశ్మీర్ నుండి దక్షిణాన మలయాళం వరకు, పశ్చిమాన రాజస్థానీ నుంచి తూర్పున అస్సామీ వరకు ‘బ్యాండెజ్ట్ మూమెంట్స్’ పుస్తకంలో ఎంతోమంది మహిళల గొంతులు వినిపిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి సామాజిక శ్రేయస్సు వరకు ఎన్నో అంశాలపై పదిహేను భారతీయ భాషలలో, మూడు మాండలికాలలో (మార్వారీ, మాగహి, భోజ్‌పురి) మహిళలు రాసిన కథల ఇంగ్లీష్ అనువాదం... బాండెజ్ట్ మూమెంట్స్ పేరుతో ముందుకు వచ్చింది.
ఉపాధ్యాయులైన ఇద్దరు మహిళలు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. పేదరికం మాత్రమే కాదు మానసిక అనారోగ్యం కూడా పెద్ద సమస్యే అని చెబుతాయి ఈ పుస్తకంలోని కథలు. ఆందోళన, నిరాశ, అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (వోసిడి), స్కిజోఫ్రేనియా...మొదలైన వాటి గురించి రచయిత్రులు తమ జీవితానుభవాల నుంచి చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి.
గ్లాస్ వాల్స్ (తమిళ్), ప్లైయింగ్ షిష్ (అస్సామీ), ది టేల్ ఆఫ్ ది టాయిలెట్ (కన్నడ), కన్వర్ట్ మై బ్యాడ్ కర్మ టు గుడ్ (హిందీ)... మొదలైన కథలు స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రాసినవే.
మానసిక ఆరోగ్యం కూడా ఒక సామాజిక సమస్య అని, అది వివక్షతకు గురవుతుందని చెప్పే కథలు... ఓ మై టెనిఫాక్టర్ (మైథిలి), గర్ల్ ఇన్ ది డాల్‌హౌస్ (పంజాబీ)... మొదలైనవి.
అబ్సెషన్ అనేది వ్యక్తి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విసియస్ సైకిల్ (గుజరాతి), ది స్మెల్ ఆఫ్ న్యూస్ (మలయాళం), బ్రేకింగ్ అవుట్ (ఉర్దూ), బోర్డర్ లైన్ (బెంగాలీ) అనేవి అబ్సెషన్ కేంద్రంగా నడిచే కథలు. క్రేజీ రివర్ (ఒడియా) అనేది మాట్లాడాలనే కోరికను, ఉత్సాహాన్ని కోల్పోయిన మహిళ కథ. ది షాడో (ఒడియా) ఒక మహిళ మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడాన్ని గురించి చెబుతుంది. ది ఎల్లో రోజ్ (ఉర్దూ) మానసిక సమస్యల్లో ఉన్న వారి ఒంటరితనం గురించి చెబుతుంది.


