మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 41 మంది నక్సల్స్ బీజాపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. కాగా ఇదివరకే మావోయిస్టులు పార్టీకి చెందిన కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో పాటు పలువురు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
రెండు రోజుల క్రితం ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న ‘పోరాటం నిలిపివేయాలన్న’ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఇవాళ 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.


